IPL 2021 Final CSK vs KKR : కరోనా కల్లోలంలో రెండు విడతలు జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈరోజు రాత్రితో ఐపీఎల్ విజేత ఎవరో తేలనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఐపీఎల్ మొదలైంది. అనంతరం క్రీడాకారులు కరోనా బారిన పడడంతో అర్థాంతరంగా వాయిదా పడింది. రెండో సగాన్ని యూఏఈలో నిర్వహించారు. ఈ అక్టోబర్ 15తో ఐపీఎల్ కు ముగింపు పడనుంది. ఇదే సమయంలో వెంటనే ప్రపంచకప్ టీ20 ఇక్కడే మొదలు కానుంది.
ఐపీఎల్ ఫైనల్ బరిలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగబోతున్నాయి. రెండు జట్లకూ ఇది ఫైనల్ మ్యాచ్. విజేత ఎవరు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఐపీఎల్ లో చెన్నై విజయవంతమైన జట్టుగా నిలిచింది. 8 సార్లు ఫైనల్ ఆడి మూడు సార్లు కప్ కొట్టింది. ఇక కోల్ కతా ఫైనల్ ఆడిన రెండు సార్లూ టైటిల్ సాధించడం విశేషం. ఈ క్రమంలోనే రెండు జట్లలో ఎవరు ఐపీఎల్ విజేత అవుతారన్నది ఈ రాత్రికి తేలనుంది.
బలబలాలు చూస్తే రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఫామ్ ప్రకారం చూస్తే బౌలింగ్, బ్యాటింగ్ లో కోల్ కతా భీకరంగా కనిపిస్తోంది. చెన్నైని మించి పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ధోని నేతృత్వంలోని చెన్నైను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారు ఫైనల్, సెమీఫైనల్స్ లో చెలరేగి ఆడుతుంటారు. దీంతో ఈసారి ఐపీఎల్ ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
చెన్నైకి, కోల్ కతాకు ఓపెనర్లే బలం.. మిడిల్ ఆర్డర్ సమస్యలున్నాయి. ఇక చెన్నై కంటే కోల్ కతా బౌలింగ్ విభాగం అత్యంత బలంగా ఉంది. ఇద్దరూ మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఈ జట్టులో ఉన్నారు. ఒత్తిడిని జయించడంలో కోల్ కతా మొన్నటి సెమీస్ లో ఢిల్లీ చేతుల్లో విఫలమై ఓటమి కోరలదాకా వెళ్లింది. త్రిపాఠి ఆఖరి బంతికి సిక్స్ కొట్టబట్టి బతికిపోయింది. లేకుండా ఫైనల్ చేజారేది. కానీ ధోని నేతృత్వంలోని చెన్నైకి ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుసు. ఆ జట్టు బలమే అది. 8 సార్లు ఫైనల్ చేరిన జట్టు ఇదీ. సో ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.