Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అద్వితీయమైన ఆటతీరుతో అదరగొడుతుంటాడు రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి నేటికీ పదహారేళ్లు పూర్తవుతోంది. 2007లో ఐర్లాండ్ జట్టుపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. నేటి వరకు వందలాది మ్యాచ్ లు ఆడి అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. పదహారేళ్ల క్రికెట్ కెరీర్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో రోహిత్ శర్మ క్రికెట్ జర్నీ ఒకసారి చూసేద్దాం.
భారత జట్టులో డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచాడు రోహిత్ శర్మ. 2007లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. అయితే ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. నాటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ జర్నీని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు. అనేక రికార్డులను తన పేరిట లిఖించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..
పదహారేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన పేరుతో నమోదు చేసుకున్నాడు. ఇప్పటి వరకు వన్డే, టెస్ట్, టి20లు కలిపి 441 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 17,115 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 91 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఇప్పటి వరకు అత్యంత వ్యక్తిగత స్కోర్ కూడా రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ వన్డేల్లో 264 పరుగుల అత్యధిక స్కోర్ శ్రీలంక జట్టుపై చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇకపోతే ఇప్పటి వరకు మూడు డబుల్ సెంచరీల రికార్డును నమోదు చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరు రాలేనంతగా ఈ హిట్ మాన్ ట్రెండ్ సెట్ చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఐదు సెంచరీలు నమోదు చేశాడు రోహిత్ శర్మ. ఇక టి20 లోనూ నాలుగు సెంచరీలను బాదేసి తన పేరు సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు.
ఫార్మాట్లు వారీగా రోహిత్ శర్మ కెరియర్..
ఇప్పటి వరకు 243 ఆడిన రోహిత్ శర్మ 9825 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 264 పరుగులు కాగా, 49 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే 50 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 3437 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 212 పరుగులు కాగా, 45 యావరేజ్ తో పరుగులు చేశాడు. టెస్ట్ కెరియర్ లో ఇప్పటి వరకు 9 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. ఇక టి20 కెరియర్ లోను తనదైన శైలిలో అదరగొట్టాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు 148 టీ20 మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ 3853 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 118 కాగా, 31 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు సహా 29 అర్ధ సెంచరీలు ఉన్నాయి.