Preeti Pal Paralympics: పారిస్ వేదికగా ప్రస్తుతం పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ పోటీలలో భారత జట్టు అథ్లెట్ ప్రీతి పాల్ మెడల్ సాధించింది. మహిళల 100 మీటర్ల పరుగులో అదరగొట్టింది. 14.21 సెకండ్ల టైమింగ్ తో కాంస్యం దక్కించుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో రైతు కుటుంబంలో ప్రీతి జన్మించింది. చిన్నతనంలోనే ఆమెను మెదడు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమె బతకడం కష్టమని తల్లిదండ్రులు భావించారు. అయినప్పటికీ ఎన్నో ఆసుపత్రులలో చూపించారు. కాస్త నయమైంది గాని.. ఆమె కాళ్ళు పూర్తిగా బలహీనంగా మారాయి. అభి శక్తివంతంగా మారడానికి ఎన్నో రకాల చికిత్సలు చేయించారు. చివరికి నడిచే అవకాశం లేకపోవడంతో దివ్యాంగులు ఉపయోగించే కాలిపర్స్ ను కాళ్లకు ధరించడం మొదలుపెట్టింది. అలా 8 సంవత్సరాల వరకు వాటితోనే నడవడం మొదలు పెట్టింది.. ఆమెకు 17 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పారా ఒలంపిక్స్ పోటీలకు సంబంధించిన రీల్స్ చూసింది. దీంతో తను కూడా అథ్లెట్ కావాలని నిర్ణయించుకుంది. తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంది. అయితే ఆమెను ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో క్రీడా ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.. ఈ క్రమంలో ఆమె పారా అథ్లెట్ పారా ఖాతూన్ ను కలిసింది. ఆమె ఆశావహ దృక్పథ పరమైన మాటలు చెప్పడంతో ప్రీతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఫాతిమా ప్రోత్సహించడంతో ప్రీతి అథ్లెట్ గా మారిపోయింది.
కెరియర్ లో ఎదిగేందుకు ఉపకరించింది
ఫాతిమా నేతృత్వంలో ప్రీతి 2018లో పారా అథ్లెటిక్స్ లో ప్రవేశించింది. ఆ పోటీలలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ.. అది ఆమె కెరియర్ లో ఎదిగేందుకు ఉపకరించింది.. ఆ తర్వాత 2022లో పారా ఆసియా క్రీడలకు ప్రీతి ఎంపికైంది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ప్రీతి వెనుకంజ వేయలేదు. ధైర్యంగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని మరింత కసరత్తు చేసింది. ఢిల్లీలో కోచ్ గజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో రాటు తేలింది. ఆ తర్వాత 2024 పారా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాలు సాధించి సత్తా చాటింది. ఆ తర్వాత తొలిసారి పారా ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక పారా ఒలింపిక్స్ లో ప్రీతి 14.21 సెకండ్ల టైమింగ్ తో కాంస్యం సాధించింది. ప్రీతి కాంస్యం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆమె మెడల్ సాధించిందని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.