Homeక్రీడలుKailasa Temple: ఈ గుడిని చూస్తే ప్రపంచ ఏడు వింతలూ తెల్లబోతాయి..

Kailasa Temple: ఈ గుడిని చూస్తే ప్రపంచ ఏడు వింతలూ తెల్లబోతాయి..

Kailasa Temple: ప్రపంచంలో ఏడు వింతలని మనం చిన్నప్పటినుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఆ వింతలను ఎలా ఎంపిక చేశారు? దాని ప్రాతిపదిక ఏమిటి? అనేది ఇప్పటివరకూ తెలియదు. సరే ఆ విషయం లోతుల్లోకి పోవడం లేదు కాని.. ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఒక గుడికి సంబంధించింది. అయితే ఈ గుడి అల్లాటప్పాది కాదు. నాలుగు ఇటుకలు, ఇంత ఇసుక, సిమెంటుతో కట్టింది అసలు కాదు. దాని రూపం, ఆకృతి, నిర్మాణ కౌశలం.. ఇప్పుడే కాదు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కాని ఎవరికీ అర్థం కాదు.

మహారాష్ట్రలోని కైలాస పేరుతో ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయ ఆకృతి చూస్తే ప్రపంచ వింతల్లో మొట్టమొదటి స్థానం దీనికే దక్కి ఉంటే బాగుండేదనే భావన ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ఈ ఆలయం ఏకశిలా నిర్మాణం. అతి పెద్ద విశాలమైన రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. పై కప్పు మాత్రమే కాదు, లోపల ఏర్పాటుచేసిన కప్పు కూడా రాతిని తొలిచి నిర్మించిందే. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 ఎల్లోరా గుహల్లో.. 16వ గుహలో ఈ కైలాస ఆలయం ఉంది. వాస్తవానికి ఏ ఆలయ నిర్మాణమైనా ప్రారంభించే ముందు పునాదులు తవ్వుతారు. గోడల నిర్మించి, కప్పులు ఏర్పాటు చేస్తారు. చివర్లో శిఖర భాగాలు నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో ఒక పెద్ద శిలను పైనుంచి అంటే శిఖరం ముందుగానే చెక్కారు. అలా లోపలికి చెక్కుకుంటూపోయారు. అద్భుతమైన రాతి కట్టడాన్ని ఆవిష్కరించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా లేని ఆ రోజుల్లో ఈ స్థాయిలో ఆలయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. ఆ ఆలయాన్ని చూస్తే చాలామంది సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. కింది నుంచి పైవరకు చూస్తే గుడి మొత్తం 107 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే భూమి నుంచి 107 అడుగుల లోతుకు రాయిని తొలిచారంటే మాటలు కాదు. ఈ గుడిని నిర్మించిన శిల్పులు ముందుగానే భూమిని అంచనా వేశారు. ఒక పెద్ద రాతిబండలో ప్రతి అంగుళాన్ని ఊహించి ఆకృతి నిర్మించారు. అలా కిందకు చెక్కుకుంటూ వెళ్లారు.. 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా మలిచారంటే మామూలు విషయం కాదు.

ఆ ఆలయ నిర్మాణాన్ని చూస్తే తక్కువలో తక్కువ నాలుగు లక్షల టన్నుల బరువైన రాతిని 18 సంవత్సరాల పాటు చెక్కితే గాని ఇలాంటి అద్భుతం సాధ్యం కాదు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 783లో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రాయిని చెక్కడం మాత్రమే కాదు.. అందులో అంతస్తులు ఏర్పాటు చేశారు. ఒకదాని నుంచి మరొక దాని పైకి వెళ్లేందుకు మెట్ల వంటి నిర్మాణాలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వంతెనలు, బాల్కనీలకు లెక్కేలేదు. ఇక వృధా నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా రాతిలోనే మలిచారు.

అప్పట్లో ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం మూడు సంవత్సరాల పాటు కష్టపడితే, కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారు. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారతం, బౌద్ధ మతానికి సంబంధించిన గాథలు శిల్పాలుగా ఉన్నాయి. ఆలయ ఆవరణలో ఒక స్తంభం మీద రకరకాల శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ఆలయ నిర్మాణమే మహా అద్భుతంగా ఉంటే.. దీని కింద అండర్ గ్రౌండ్ సిటీ కూడా ఉందట. అందులోకి వెళ్ళడానికి రెండు అడుగుల సొరంగం ఉంది. అయితే అందులోకి మనిషి వెళ్లడం దాదాపు అసాధ్యం. ఆలయం దిగువ భాగాన పెద్దపెద్ద రంధ్రాలు ఉన్నాయి. అవి కూడా చాలా లోతులో ఉన్నాయి. కైలాసాలయంలో ఉన్న శివలింగం ప్రత్యేకమైనది. శివలింగంపై నీళ్లు పోస్తే అవి ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ అంతు పట్టదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అంతకుమించి విశేషాలున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular