Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Aus BGT: భారత్ - ఆస్ట్రేలియా మధ్య వివాదాలకు లెక్కేలేదు.. జరిగిన చర్చకు...

Ind Vs Aus BGT: భారత్ – ఆస్ట్రేలియా మధ్య వివాదాలకు లెక్కేలేదు.. జరిగిన చర్చకు అంతే లేదు..

Ind Vs Aus BGT: 1996లో జరిగిన టెస్ట్ ద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. అయితే దానికంటే ముందు స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరంలో 1947 -48 కాలంల మధ్యలో భారత్ తొలిసారి ఆస్ట్రేలియా వెళ్ళింది. సిడ్ని వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత బౌలర్ వినూ మన్కడ్ బౌలింగ్ వేస్తుండగా ఆస్ట్రేలియా బ్యాటర్ బిల్ బ్రౌన్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చాడు. అలా అతడు రావడంతో విను మన్కడ్ అప్రమత్తమయ్యాడు. స్టంప్స్ నేలకూల్చాడు. దానిని ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అప్పటినుంచి అది మన్కడింగ్ అనే నాన్ స్ట్రైకర్ రన్ అవుట్ షురూ అయింది. ఇప్పుడు ఏకంగా చట్టబద్ధమైంది. ఆ అవుట్ పై ఆస్ట్రేలియా నాడు మండిపడింది. అయితే నాటి కెప్టెన్ బ్రాడ్ మన్ మాత్రం భారత్ ను సమర్థించారు.

1980 -81 కాలంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో అంపైర్ వైట్ హెడ్ అనే ఆటగాడి ఎల్బీ విషయంలో తప్పుడు నిర్ణయం వెలువరించారు. దీంతో నాటి భారత ఆటగాడు సునీల్ గవాస్కర్, తన సహచరుడు చేతన్ చౌహన్ తో కలిసి గ్రౌండ్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అప్పుడు జట్టు మేనేజర్ గా షాహిద్ దూరానీ ఉన్నారు.. ఈ విషయంలో ఆయన కలగజేసుకొని మాట్లాడినప్పటికీ సునీల్ గవాస్కర్ వెనకడుగు వేయలేదు. చౌహాన్ మాత్రం తిరిగి వెళ్లి ఆడాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ లిల్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

హర్భజన్ వర్సెస్ సైమండ్స్

2008లో హర్భజన్ సింగ్, అండ్రు సైమండ్స్ మధ్య మంకీ గేట్ వివాదం ఏర్పడింది. సిడ్నీలో హర్భజన్ సింగ్, సైమండ్స్ వాగ్వాదం జరిగింది.. ఈ నేపథ్యంలో హర్భజన్ తనను మంకీ అని పిలిచాడని సైమండ్స్ ఆరోపించాడు.. వాటిని భారత్ ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ మైక్ ప్రొక్టేర్ హర్భజన్ పై చర్యలు తీసుకున్నాడు. ఏకంగా మూడు మ్యాచ్లలో ఆడకుండా నిషేధం విధించాడు. దీంతో భారత జట్టు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఐసీసీ మధ్యలో కలగజేసుకొని హర్భజన్ సింగ్ పై విధించిన మ్యాచ్ నిషేధాన్ని తొలగించింది. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయడం వెనుక సచిన్ కీలక పాత్ర పోషించారని అప్పటి ఆటగాళ్లు చెబుతుంటారు. అయితే రెండు సంవత్సరాల క్రితం సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో హర్భజన్ సింగ్ కన్నీటి పర్యంతమవుతూ.. భావోద్వేగమైన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

స్మిత్ తిక్క కుదిరింది

2017 -18 సీజన్లో ఆస్ట్రేలియా భారత్లో పర్యటించింది. బెంగళూరు వేదిక జరిగిన మ్యాచ్లో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఓవర్ స్మార్ట్ నెస్ ను ప్రదర్శించాడు. ఉమేష్ యాదవ్ వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయి .. ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో డీఆర్ఎస్ తీసుకోవడానికి ఆలోచించాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. దీనిని గుర్తించిన భారత కెప్టెన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అంపైర్లు అతడిని పెవిలియన్ పంపించారు. అయితే విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని అక్కడితోనే ముగించలేదు. విలేకరుల సమావేశంలో స్మిత్ అతి తెలివిని కడిగిపారేశాడు.

ఆస్ట్రేలియా క్షమాపణ చెప్పింది

2020 -21 సీజన్లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించింది. సిడ్నీలో మూడవ టెస్ట్ జరిగింది. ఆ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన కొంతమంది ప్రేక్షకులు మహమ్మద్ సిరాజ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా పై కూడా రకరకాల విమర్శలు చేశారు.. సిరాజ్ ఈ విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానే దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని రహానే అంపైర్లతో చెప్పాడు. దీంతో అధికారులు ఆరుగురు అభిమానులను స్టేడియం బయటికి పంపించారు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ కూడా చెప్పింది.

రిషబ్ గట్టిగా ఇచ్చుకున్నాడు

2018 -19 సిరీస్ సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ ఫైన్ పంత్ ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేశాడు. “మా పాపకు బేబీ సిట్ గా ఉంటావా” అంటూ ఎగతాళి చేశాడు. దేవుని మనసులో పెట్టుకున్న పంత్ చెలరేగిపోయాడు.. తన నోటికి పని చెప్పాడు..” ఇక్కడ స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. కాకపోతే అతడు టెంపరరీ మాత్రమే” అంటూ పైన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాలు ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగాయి. మరి ఈసారి జరిగే ఐదు టెస్టుల సిరీస్ లో ఇంకా ఎన్ని వివాదాలు జరుగుతాయో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ ఎలా చేస్తారో.. వాటిని భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular