Indian Women Team: వరల్డ్ కప్ సాధించిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మరింత రెచ్చిపోతున్నారు. స్వదేశం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు గెలిచారు. ముఖ్యంగా నాలుగో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్లు స్మృతి, శఫాలీ వర్మ రికార్డు స్థాయిలో భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ప్రత్యర్థులకు ప్రమాదకరమైన హెచ్చరికలను పంపించారు.
శ్రీలంక జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్లో టీమిండియా టి20 లలోనే భారీ స్కోర్ చేసింది. 2024లో వెస్టిండీస్ జట్టు మీద 217/4 స్కోర్ చేసింది టీం ఇండియా. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. శ్రీలంక జట్టు మీద ఏకంగా 221/2 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో స్మృతి 80, వర్మ 79 పరుగులు చేశారు. ఈ జంట తొలి వికెట్ భాగస్వామ్యానికి 162 పరుగులు జోడించింది. ఇది ఏ ఫార్మాట్లో అయినా భారతదేశం తరఫున ఈ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2025 లో ఇంగ్లాండ్ పై 210/5, 2024లో యూఏఈ పై 201/5, 2018లో ఇంగ్లాండ్ పై 198/4 పరుగులు చేసింది టీమిండియా. 2019లో వెస్టిండీస్ జట్టు మీద తొలి వికెట్ కు ఇండియా 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ రాజ్ తర్వాత అన్ని ఫార్మాట్లలో పదివేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా స్మృతి నిలిచింది.
టీమిండియా 221 పరుగులు చేస్తే.. శ్రీలంక కూడా గట్టి పోటీ ఇచ్చింది. 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక 191 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ద్వారా.. 2026 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు. జూన్ 12న ఈ మహిళల టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. జూన్ 14న పాకిస్తాన్ జట్టుతో టీమ్ ఇండియా పోటీ పడుతుంది. ఇక ఇదే సమయంలో శ్రీలంక జూన్ 16న డిపెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టుతో పోటీపడుతుంది. వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత భారత మహిళా క్రికెటర్ల ఆటతీరులో మార్పు వచ్చిందని.. అందువల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.