Rohit Sharma : రోహిత్ శర్మ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి ఎదురవుతున్నప్పుడు దానిని అధిగమించేలా నిర్ణయాలు తీసుకుంటాడు. అవలీలగా సిక్స్ లు కొడుతుంటాడు.. ఇలాంటి అభిప్రాయాలను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నుంచి మొదలు పెడితే చాలామంది మాజీ కెప్టెన్లు వ్యక్తం చేశారు. అయితే ఇటీవల రోహిత్ శర్మకు మతిమరుపు ఎక్కువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. వస్తువులను, చెప్పాలనుకున్న విషయాలను మర్చిపోతుంటాడనే వాదనలు ఇటీవల వినిపించడం పెరిగిపోయింది. ఈ క్రమంలో భారత అంపైర్ అనిల్ చౌధరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రోహిత్ కు లేజీ అనే పదం సరైనది కాదని అనిల్ చౌధరి వ్యాఖ్యానించాడు. ఆ పదం అసలు రోహిత్ శర్మకు సరిపడదని పేర్కొన్నాడు. 50 కి పైగా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్ గా వ్యవహరించిన నేపథ్యం అనిల్ చౌధరికి ఉంది. రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు సారధ్యం వహించిన మ్యాచ్ లకు కూడా అనిల్ చౌధరి అంపైర్ గా వ్యవహరించాడు. మైదానంలో రోహిత్ శర్మ ఆడుతున్న తీరును దగ్గరుండి పరిశీలించాడు. అతడి నాయకత్వ పటిమను ఎప్పటికప్పుడు అంచనా వేశాడు.. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రోహిత్ శర్మ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
” రోహిత్ శర్మకు ప్రస్తుతం 37 సంవత్సరాలు. సాధారణ వ్యక్తి లాగా అందరికీ అతడు కనిపిస్తాడు. అతడికి అధిక క్రికెట్ ఐక్యూ ఉంటుంది. ఇలాంటి ఘనత సొంతం చేసుకున్న ఆటగాళ్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలి? జట్టుకు అవసరమైనప్పుడల్లా ఎలా ఆడాలి? కష్ట సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఆటగాళ్లతో ఎలా సమన్వయం చేసుకోవాలనేది రోహిత్ కు పూర్తిగా తెలుసు. అతడు అంపైరింగ్ కూడా అత్యంత సులువుగా నిర్వహించగలడు. అవుట్, నాట్ అవుట్ విషయంలో ఒక స్పష్టతతో ఉంటాడు. మిగతా ఆటగాళ్లలాగా గందరగోళానికి గురికాడు. ఒక్కోసారి బౌలర్ల మైండ్ సెట్ పూర్తిగా అర్థం చేసుకుంటాడు. యార్కర్లను సంధిస్తే.. వాటిని సిక్స్ లుగా మలచగలడు. ఈడెన్ గార్డెన్స్ లో 2013లో శ్రీలంక జట్టుపై జరిగిన మ్యాచ్లో 264 రన్స్ చేశాడు. ఇప్పటివరకు వన్డేలలో అదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది. దీనిని బట్టి రోహిత్ అనేవాడు సాధారణ చట్రంలో ఇమడని అసాధారణ ఆటగాడని అర్థం చేసుకోవచ్చు. రోహిత్ ప్రస్తుత కాలంలో అనితర సాధ్యమైన ఆటగాడని” అనిల్ చౌధరి సోషల్ మీడియాలో తన పోస్టులో పేర్కొన్నాడు.