IND Vs SA: గుహవాటి టెస్ట్ టీమ్ ఇండియాకు ఎన్నో విధాలుగా నష్టం కలగజేసినప్పటికీ.. ఒక విషయంలో మాత్రం లాభం చేకూర్చింది. ఒక బౌలర్ లో ఉన్న బ్యాటింగ్ పరాక్రమాన్ని బయటపెట్టేలా చేసింది.. ఒకవేళ అతడిని మేనేజ్మెంట్ గుర్తించి.. మరింత సాన పెడితే మాత్రం కచ్చితంగా మరో రవిచంద్రన్ అశ్విన్ అవుతాడు.
రవిచంద్ర అశ్విన్ అద్భుతమైన స్పిన్ బౌలర్.. బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. అతని ఖాతాలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే చేశాడు. దీనినిబట్టి అతని బ్యాటింగ్ తెగువను అర్థం చేసుకోవచ్చు.. ఇటీవల టెస్ట్ ఫార్మాట్ నుంచి అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించింది. ఇప్పుడు దానికి నేనున్నానంటూ సమాధానం చెబుతున్నాడు కులదీప్ యాదవ్.
కులదీప్ యాదవ్ గుహవాటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. వాస్తవానికి ఇది తొలి ఇన్నింగ్స్ లో ఏ వికెట్ కైనా సరే అత్యుత్తమ భాగస్వామ్యం.. కులదీప్ యాదవ్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఇందులో అతడివి మూడు బౌండరీలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా కులదీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. 43.3 ఓవర్ వద్ద 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసిన టీమిండియా.. మరికొద్ది సేపట్లో ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలోనే కులదీప్ ఆపద్బాంధవుడుగా నిలిచాడు. ఒకరకంగా దక్షిణాఫ్రికా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.. ప్రతి బంతిని కచ్చితత్వంతో ఎదుర్కొని సత్తా చూపించాడు.
కులదీప్ యాదవ్ ఇలా వందకు మించి బంతులను ఎదుర్కోవడం ఇది మూడవసారి. 17 ఇన్నింగ్స్ లలో అతడు మూడుసార్లు 100కు మించిన బంతులను ఎదుర్కొన్నాడు.. కులదీప్ కంటే ముందుకిర్మని 33 ఇన్నింగ్స్ లలో మూడుసార్లు 100కు మించిన బంతులను ఎదుర్కొన్నాడు. కిరణ్ మోరే 34 ఇన్నింగ్స్ లలో నాలుగు సార్లు 100కు మించిన బంతులను ఎదుర్కొన్నాడు. ఇన్నిసార్లు కూడా 9వ నెంబర్ లోనే కులదీప్ బ్యాటింగ్ కు దిగడం విశేషం.