ఒలింపిక్స్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన మీరాబాయి చానూ మినహా.. మిగిలిన విభాగాల్లో సక్సెస్ రిపీట్ కావట్లేదు. పలువిభాగాల్లో ఆటగాళ్లు తొలి రౌండ్లోనే పోరాటం ముగించారు. ఆర్చరీ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ పోరు ముగిసిపోయింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్ లో మాత్రం తొలి రౌండ్ గట్టెక్కింది.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ లో భారత్ శుభారంభం చేసింది. వరల్డ్ నంబర్ 3 జోడీపై చిరాగ్ శెట్టి – సాత్విక్ జంట విజయం సాధించింది. చైనా ఆటగాళ్లు యాంగ్ లీ – చిన్ లిన్ వాంగ్ జోడీపై భారత జంట గెలుపొందింది. 21-16, 16-21, 27-24తో విజయం నమోదు చేసింది. బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్ లో మాత్రం షట్లర్ సాయి ప్రణీత్ నిరాశపరిచాడు. ఇజ్రాయెల్ ఆటగాడి చేతిలో ఓడిపోయాడు.
టేబుల్ టెన్ని మహిళల సింగిల్స్ లో మొదటి రౌండ్ లో భారత్ గెలిచింది. గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ టిన్ టిన్ హోపై 4-0 తేడాతో మినకా బాత్రా గ్రాండ్ విక్టరీ సాధించింది. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మాత్రం మనికా బాత్రా- శరత్ కమల్ జోడీ విఫలమైంది.
టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో సుమిత్ నాగల్ సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెన్నిస్ ఇస్తోమిన్ పై విజయం సాధించాడు. ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ లో ఒక విజయం సాధించిన భారత మూడో ఆటగాడు సుమిత్ కావడం విశేషం. ఇప్పట ఇవరకు జీషన్ అలీ, లియాండర్ పేస్ మాత్రమే సింగిల్స్ లో ఒక మ్యాచ్ అయినా గెలిచారు. 1996లో పేస్ కాంస్యం కూడా గెలుచుకున్నాడు. దాదాపు పాతికేళ్ల తర్వాత సింగిల్స్ లో భారత ఆటగాడు తొలి రౌండ్లో గెలిచాడు.
ఆర్చరీలో నిరాశే ఎదురైంది. మిక్సడ్ టీమ్ ఈవెంట్ లో భారత ఆటగాళ్లు ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్ లో దక్షిణి కొరియా ఆటగాళ్ల చేతిలో దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ ఓటమిపాలయ్యారు. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో కూడా భారత్ ఓడిపోయింది. యువ షూటర్ సౌరభ్ తివారి రెండో ఎలివేషన్లో ఏడో స్థానంలో నిలిచి, పోటీ నుంచి నిష్క్రమించాడు. ఈ విధంగా.. భారత్ కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మరి, ఇందులో ఎవరైనా పతకం సాధిస్తారేమో చూడాలి.