Jai Shaw : అతడు ప్రొఫెషనల్ క్రికెటర్ కాదు. పోనీ గల్లీలో ఆడాడా అంటే దానికి సంబంధించిన రుజువులు లేవు. రంజీ లో ఆడడా అంటే లేదు. ఏ మెరిట్స్ లేకపోయినప్పటికీ అతడు ప్రపంచంలోనే అతి పెద్ద ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ కి కార్యదర్శి. పైగా అతడి తండ్రి కేంద్ర హోం శాఖ మంత్రి. ఎవరి గురించి చెప్తున్నామో ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. అతడే జై షా. ఇప్పుడు ఏకంగా ఇండియన్ క్రికెటర్లనే మించి పోయాడు. అతడి తండ్రి కోరుకున్నది కూడా అదే కాబట్టి.. అలానే జరిగిపోయింది.
మనదేశంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే ఓ పెద్ద మీడియా హౌస్ ఉంది. అది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు ముందు దేశంలో వందమంది ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. దీని వెనుక కొంత కసరత్తు జరుగుతుంటుంది. త్వరలో మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈసారి కూడా ఇండియన్ ఎక్స్ ప్రెస్ దేశంలో అత్యంత ప్రభావశీలమైన వంద మంది వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండవ స్థానంలో ఉన్నారు. బహుశా ఈ స్థానాలు వేరే వాళ్లకు ఇవ్వడం ఇష్టం లేకనో? ఇస్తే ఎన్నికల ముందు జాకెట్ యాడ్స్ రావని భయమో? ఇంకేదైనా దాడులకు సిద్ధం కావాల్సి వస్తుందని వణుకో? తెలియదు గాని.. ఎందుకొచ్చిన తంటా అనుకుని మొదటి, రెండు స్థానాలు.. ఆ ఇద్దరు వ్యక్తులకే కేటాయించింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే.. నెంబర్ 2 లో అమిత్ షా కొడుకు జై షా ఈ జాబితాలో స్థానం సంపాదించాడు. ఇది ఏ తండ్రి కైనా గర్వకారణమే అయినప్పటికీ.. అతడు ఏకంగా ఇండియన్ క్రికెటర్లను పక్కనపెట్టి మరి ముందు వరసలోకి వచ్చేసాడు.
ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 38, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 58, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 68 స్థానాల్లో ఉన్నారు. అయితే బీసీసీఐకి సెక్రటరీగా ఉన్న జై షా మాత్రం ఏకంగా 35వ స్థానం సంపాదించుకున్నాడు. అదేంటి ఇండియన్ క్రికెటర్లను కాదని జై షాకు ఎలా ఇస్తారు అంటారా? అక్కడే ఉంది మ్యాజిక్కు. పెద్ద పెద్ద మీడియా హౌస్ లో సర్వే ఎందుకు చేస్తాయో అందరికీ తెలిసిందే. అది కూడా ఎన్నికల సమయంలో సర్వే ఎందుకు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో కూడా జగత్ విధితమే. కొన్ని మీడియా హౌసులు మాత్రం కాన్ క్లేవ్ పేరుతో సదస్సులు దానికి అయ్యే ఖర్చు మొత్తం అధికారంలో ఉన్న పార్టీ నే భరించాలి. సరే అది వేరే విషయం.. అసలు ఈ సర్వే ఎలా చేస్తారో? దీనికి ప్రాతిపదిక ఏమిటో? శాంపిల్ గా ఎంతమందిని తీసుకుంటారో? ఎవరికీ తెలియదు. స్థూలంగా చెప్పాలంటే ఎన్నికల ముందు “నొప్పించక తానొవ్వక” అనే పద్యం తీరుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే ఉంది. అన్నట్టు ఈ జాబితాలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు స్థానం దక్కలేదు. ది గ్రేట్ విజినరీ చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇవ్వలేదు. అంటే ఇందులో నరేంద్ర మోడీ ఏదైనా కుట్ర చేశాడా? అమిత్ షా తెరవెనుక పావులు కదిపాడా? ఈ కుట్ర గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడు రాస్తాయా? నమస్తే తెలంగాణ “తెలంగాణ జాతిపిత”కు జరిగిన అన్యాయం అని శోకాలు పెడుతుందా? చాలామందికి మింగుడు పడని విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వేలో 39వ స్థానం దక్కించుకున్నాడు.