India Vs England: 5 టెస్టుల సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ భారీ విజయాన్ని సాధించింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టు 319 పరుగులు చేసింది. తద్వారా 126 పరుగులు వెనుకబడింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సహాయంతో నాలుగు వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో 557 పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ చెలరేగి బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 122 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ జట్టులో మార్కువుడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
రాజ్ కోట్ లో సాధించిన విజయం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది. 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును భారత జట్టు మట్టి కరిపించింది. 2021 లో ముంబై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్ కోట్ విజయాన్ని కంటే ముందు ఇదే భారత్ సాధించిన భారీ విజయంగా ఉండేది. 2015 లో ఢిల్లీ వేదికగా సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2016లో ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2008లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 320 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రాజ్ కోట్ లో చవిచూసిన పరాభవం రెండవ అతిపెద్దది. 1934 సంవత్సరంలో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 562 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. 2024 ఫిబ్రవరిలో రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత చేతిలో 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. 1976 లో మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 425 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 1948లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో 409 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. 2015 సంవత్సరం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 405 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.