IND Vs SA World Cup Final: క్రికెట్ చరిత్రలో వన్డే వరల్డ్ కప్ కు ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అది మహిళలు కావచ్చు.. పురుషులు కావచ్చు.. ఇక్కడ జెండర్ ను పక్కన పెడితే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా దూసుకుపోతుంటాయి. అయితే ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ దాకా వెళ్ళిపోయాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోలేదు. ఈ ప్రకారం తీసుకుంటే ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్లో కొత్త విజేత ఆవిర్భవించే అవకాశం ఉంది.
భారత మహిళల జట్టు ఇప్పటివరకు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. రెండుసార్లు కూడా నిరాశతో వచ్చింది. కానీ ఈసారి ఫైనల్ వెళ్లిన భారత జట్టు కచ్చితంగా ట్రోఫీ అందుకోవాలని భావిస్తోంది. పైగా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది కాబట్టి టీమిండియా కు అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 12సార్లు మహిళల వన్డే ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా ఏడుసార్లు ట్రోఫీని అందుకుంది. ఇంగ్లాండ్ నాలుగుసార్లు.. న్యూజిలాండ్ ఒకసారి విజేతలుగా నిలిచాయి. అయితే ఈసారి ఈ మూడు చెట్లు ఫైనల్ దాకా రాలేదు. దీంతో కొత్త ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి భారత్, సౌత్ ఆఫ్రికా జట్లకు అవకాశం లభించింది.
2005, 2017 లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే చివరి దశలో ఒత్తిడికి గురి కావడంతో విజేత కాకుండానే వెనక్కి వచ్చేసింది.. అయితే ఈసారి టైటిల్ సొంతం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది.. సెమి ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీం ఇండియా. ఇదే ఊపును దక్షిణాఫ్రికా మీద కొనసాగిస్తే టీమ్ ఇండియాకు తిరిగి ఉండదు.
లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా ఏడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదింట్లో గెలిచింది. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో మాత్రం దక్షిణాఫ్రికా జట్టు దారుణంగా ఓడిపోయింది. రెండు మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన స్పిన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవడమే. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 69 పరుగులకు సౌత్ఆఫ్రికా కుప్ప కూలిపోయింది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆల్ అవుట్ అయింది. సఫారీ ప్లేయర్లకు స్పిన్ బలహీనత ఉంటుంది. దీనిని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోవాలి.
భారత జట్టులో దీప్తి శర్మ అద్భుతమైన స్పిన్ బౌలర్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆమె 17 వికెట్లు సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కనుక ఆమె అద్భుతమైన ప్రతిభ చూపిస్తే టీం ఇండియాకు తిరిగి ఉండదు. ఇక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో రాధ యాదవ్ దారుణంగా పరుగులు ఇచ్చింది. స్నేహ్ రాణా ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు యువ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్ వేస్తోంది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించింది. ఫైనల్ మ్యాచ్లో కూడా ఆమె అదే తీరును కొనసాగిస్తే టీమిండియా కు తిరిగి ఉండదు. బ్యాటింగ్లో స్మృతి భీకరమైన ఫామ్ లో ఉంది. కెప్టెన్ కౌర్, జెమీమా సూపర్ ఫామ్ లోకి రావడం టీమిండియా కు అత్యంత బలం. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్లో టీం ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ మాదిరిగా ప్రతిభ చూపిస్తే టీం ఇండియాకు అడ్డు ఉండదు.