Ind Vs SA World Cup Final: 2005, 2017 తర్వాత టీమ్ ఇండియా ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లోకి ప్రవేశించింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో.. 2017లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. 2017లో మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు దాదాపు చుక్కలు చూపించింది. ట్రోఫీని గెలుచుకునే స్థాయి దాకా వచ్చింది. అయితే ఊహించని పరిణామం ఇంగ్లాండ్ జట్టును విజేతగా చేసింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని టీమిండియా ప్లేయర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కట్టుదిట్టంగా ఆడుతున్నారు. సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మీద టీమిండియా భారీ స్కోర్ ను సైతం ఛేదించి విజయం సాధించింది. ఇదే ఉత్సాహాన్ని ఫైనల్ మ్యాచ్లో కూడా కొనసాగించాలని భారత అభిమానులు జట్టు ప్లేయర్లను కోరుతున్నారు.
Also Read: సఫారిని తక్కువ అంచనా వేయద్దు.. ఆ ఐదుగురి పని పడితే ఇండియా దే కప్!
2017 తర్వాత భారత జట్టు ఫైనల్ లో ఆడుతున్న నేపథ్యంలో అందరిలోనూ విపరీతమైన ఆసక్తి పెరిగింది. పైగా భారత జట్టు గతంతో పోల్చి చూస్తే అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టీం ఇండియా విజేతగా నిలుస్తుందని.. తొలిసారి ట్రోఫీని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల మాదిరిగానే బీసీసీఐ కూడా మహిళల జట్టు మీద విపరీతమైన అంచనాలతో ఉంది. ఒకవేళ ట్రోఫీ కనక గెలిస్తే భారీ నజరానా ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2024 t20 వరల్డ్ కప్ ను రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా గెలిచినప్పుడు బిసిసిఐ ఏకంగా 125 కోట్ల ప్రైస్ మనీ ప్రకటించింది. ఇక ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో మహిళల జట్టు కనుక వన్డే వరల్డ్ కప్ గెలిస్తే అంతే మొత్తంలో నజరానా ఇవ్వాలని బిసిసిఐ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం బీసీసీఐ మహిళ క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా వేతనాలు చెల్లిస్తోంది. అందువల్లే పురుషులు జట్టుకు 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ స్థాయిలో అయితే నజరానా ప్రకటించారో… మహిళల జట్టుకు కూడా అదేవిధంగా నగదు ఇవ్వాలని మేనేజ్మెంట్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.