India vs South Africa Final Highlights: దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు మీద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తర్వాత వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. భారత్ కొట్టిన 298 పరుగులను చేజ్ చేయడంలో దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ జట్టు కెప్టెన్ లారా సూపర్ సెంచరీ చేసి అదరగొట్టింది. తోటి ప్లేయర్లు విఫలమవుతున్నప్పటికీ.. తను మాత్రం దూకుడు కొనసాగించింది. ఒకానొక దశలో ఆ జట్టు గెలుస్తుందనే నమ్మకాన్ని అభిమానులలో కలిగించింది. కొన్ని సందర్భాలలో భారీగా పరుగులు చేసి టీమిండియా శిబిరంలో భయాన్ని కలగజేసింది. దీంతో లారాను పక్కనపెట్టి టీమ్ ఇండియా బౌలర్లు మిగతా బ్యాటర్ లను టార్గెట్ చేసుకున్నారు. తద్వారా దక్షిణాఫ్రికా జట్టు ఒడిదుడుకులకు గురైంది. అయినప్పటికీ లారా ఒంటరి పోరాటంతో విజయం వైపు అడుగులు వేసింది. అయితే కీలక దశలో టీమిండియా కెప్టెన్ కౌర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించడంతో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో చిత్తయిపోయింది. ఓటమి పాలై ట్రోఫీని దూరం చేసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా అభిమానులు, ఆ జట్టు ప్లేయర్లు నిరాశలో మునిగిపోయారు. జట్టు ఓడిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియాలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్లేయర్లు ముంబై మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. కెప్టెన్ కౌర్ మంచి మొదలు పెడితే శ్రీ చరణి వరకు నినాదాలు చేస్తూ.. మైదానంలో ఉన్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సంబరాల అనంతరం ఐసీసీ చైర్మన్ జై షా టీమిండియా సారధి కౌర్ కు ట్రోఫీని అందించారు. అయితే ఈ ట్రోఫీని అందుకుంటున్న సమయంలో కౌర్ డిఫరెంట్ యాటిట్యూడ్ ను ప్రదర్శించారు. నెమ్మదిగా అడుగులు వేస్తూ ట్రోఫీని అందుకునే క్రమంలో ఒక్కసారిగా వేగాన్ని పెంచారు. ఈ ప్రకారం ఈ టోర్నీలో టీమిండియా ప్రయాణం నెమ్మదిగా ప్రారంభమైందని.. ఆ తర్వాత జోరం అందుకుందని చెప్పే ప్రయత్నం చేశారు. ట్రోఫీ అందుకున్న తర్వాత ప్లేయర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఈ ట్రోఫీని గెలవడానికి టీమిండియా దశాబ్దాల పాటు నిరీక్షించింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్నో కన్నీళ్లను దిగమింగుకుంది. చివరికి విశ్వవిజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.