India Vs South Africa 5th T20: వడ్డించే వాడు మన వాడైతే ఎక్కడా కూర్చున్నా సరే విస్తరిలో నిండా ముక్కలు పడతాయి. టీమిండియాలో వడ్డించే స్థానంలో గంభీర్ ఉన్నాడు కాబట్టి గిల్, హర్షిత్ రాణా కు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. వారి కంటే గొప్పగా ఆడే ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారందరూ రిజర్వ్ బెంచ్ కు పరిమితమవుతున్నారు.
దీనిపై ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ గంభీర్ మారలేదు. గిల్ విఫలమవుతున్నప్పటికీ, హర్షిత్ ఆకట్టుకోలేకపోయినప్పటికీ వరుసగా అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గంభీర్ వేసుకున్న లెక్కలు తారు మారయ్యాయి.. గిల్ కు గాయం తిరగబెట్టింది. హర్షిత్ ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో.. అతడికి స్థాన చలనం తప్పలేదు.
గిల్ స్థానంలో టీమిండియాలోకి సంజు శాంసన్ వచ్చాడు. వాస్తవానికి సంజు శాంసన్ కు దక్షిణాఫ్రికా మీద అద్భుతమైన రికార్డు ఉంది. అతడు వరుసగా సెంచరీలు చేసి అదరగొట్టాడు. అటువంటి సంజు కు ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్లో రిజర్వు బెంచ్ కు పరిమితమయ్యాడు. అతడిని కాదని గిల్ కు అవకాశాలిస్తే.. అతడు ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. చివరికి గాయం కారణంగా అతడిని పక్కకు తప్పించారు. తద్వారా ఆ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం కల్పించారు. దీంతో అతడు ప్రస్తుతం ఐదవ టి20 మ్యాచ్లో ఆడుతున్నాడు.
ఈ మ్యాచ్ కు ముందు సంజు కు అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ జరిగింది.. దీనికి తోడు గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు చోటు ఇస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. చివరికి గౌతమ్ గంభీర్ ఒత్తిడి తట్టుకోలేక సంజు కు అవకాశం ఇచ్చాడు. ఐదో టి 20 మ్యాచ్లో అతడు అభిషేక్ శర్మ తో ఓపెనర్ గా వచ్చాడు. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 41 పరుగులు చేసింది. సంజు 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు.