India Vs South Africa 2nd Test: సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి టీమిండియా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. మళ్లీ ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశం వేదికగా వైట్ వాష్ కు గురైంది. భయంకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ టీమిండియా ఇలా వైట్ వాష్ కు గురికావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వెనుక కారణాలు ఎలా ఉన్నప్పటికీ ప్లేయర్లు ఇలా విఫలం కావడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.
వాస్తవానికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు గంటల తరబడి క్రికెట్ ఆడారు.. బ్యాటింగ్ విషయంలో, బౌలింగ్ విషయంలో కూడా సత్తా చాటారు. ఫీల్డింగ్ విషయంలో కూడా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. అయితే ఇదే ఆటతీరు టీమిండియా ప్లేయర్లు ప్రదర్శించలేకపోవడం అభిమానుల్లో ఆవేదన కలిగిస్తోంది. ” ఇలాంటి ఆట ఆడుతున్నారు.. ఇలాంటి ఆట కోసమేనా టెస్టులు ఆడేది. ఇప్పటికైనా జట్టులో మార్పులు తీసుకురాకపోతే శ్రీలంక, వెస్టిండీస్ మాదిరిగా టీమిండియా అవుతుందని” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి టెస్ట్ ఫార్మాట్ ఆడాలంటే ప్లేయర్లలో విపరీతమైన సహనం ఉండాలి. రోజుల తరబడి క్రికెట్ ఆడాలంటే విపరీతమైన నేర్పరితనం ఉండాలి. దురదృష్టవశాత్తు టీమిండియా ప్లేయర్లలో ఇదేమి కనిపించడం లేదు. స్వదేశంలో ఆడుతున్నామని సోయి కూడా ప్లేయర్లలో కనిపించకపోవడం అత్యంత దారుణం. టెస్ట్ జట్టుకు కూర్పు విషయంలో ఐపీఎల్ ను ప్రాతిపదికగా తీసుకోవడం ఎంత తప్పో తాజా దక్షిణాఫ్రికా సిరీస్ నిరూపిస్తోంది.. ఐపీఎల్ ఆధారంగా ప్లేయర్లను సెలెక్ట్ చేయడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టి20 లకు ఎంపిక చేయాలి. కానీ అటువంటి ప్లేయర్లను టెస్టులకు ఎంపిక చేయడం సరైన విధానం కాదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్విషా, జగదీషన్, రుతు రాజ్ గైక్వాడ్ డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుండేదని.. వీరంతా కూడా దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నారని.. ఈ విషయం గౌతమ్ గంభీర్ కు అర్థం కావడం లేదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే జనవరిలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం కచ్చితంగా ఆడే ప్లేయర్లను ఎంపిక చేయాలని.. అప్పుడే టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ లో వరుస విజయాలు సాధిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే మాత్రం టీమిండియా ఇబ్బంది పడాల్సి ఉంటుందని.. ర్యాంకులు క్రమంగా కోల్పోయి పరువు తీసుకోవాల్సి వస్తుందని అభిమానులు హెచ్చరిస్తున్నారు.