IND Vs SA: దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. ఈ పరాభవం నుంచి టీమిండియా ఎటువంటి గుణపాఠం నేర్చుకుందో తెలియదు కానీ.. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా దక్షిణాఫ్రికా జట్టుకు టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గాయం వల్ల కెప్టెన్ గిల్ ఈ సిరీస్ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత మళ్లీ విరాట్, రోహిత్ జట్టులో కనిపించబోతున్నారు. కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాను నడిపించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత పంత్ వన్డే జట్టులోకి వచ్చాడు. జైస్వాల్ రోహిత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడు.
టెస్ట్ ఫార్మాట్ కు దూరమైన తర్వాత రోహిత్, విరాట్.. వన్డే ఫార్మాట్లో సత్తా చూపించారు. రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టులో కొనసాగుతున్నారు రోహిత్, విరాట్. ఈ సిరీస్ లో సత్తా చాటితే వారికి తిరుగు ఉండదు.. పరిమిత ఓవర్లలో భారీ ఇన్నింగ్స్ ఆడాలని యశస్వి భావిస్తున్నాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. రోహిత్ తో కలిసి అతడు టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.. ఒకవేళ యశస్వి గనుక తన ప్రతిభను నిరూపించుకుంటే జట్టులో తిరుగు ఉండదు.
కెప్టెన్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. క్రికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతడే నిర్వర్తిస్తాడు.. నాలుగు స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్, రుతు రాజ్ గైక్వాడ్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాల్సి ఉంది.. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అత్యంత కీలకం కాబోతున్నారు.
నితిష్ కుమార్ రెడ్డి ఇటీవల అన్ని ఫార్మాట్లలో విఫలమవుతున్నాడు. జట్టులో చోటు స్థిరంగా ఉండాలంటే అతడు కచ్చితంగా ఈ సిరీస్లో ఆదరగొట్టాల్సి ఉంది.. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ వంటి వారు పేస్ భారాన్ని మోయబోతున్నారు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను మీరు ఎలా దెబ్బ కొడతారనేది ఆసక్తి కరం.
పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు ఉత్సాహంతో కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత ఆ జట్టులో ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం కనిపిస్తోంది. కెప్టెన్ బవుమా, మార్క్రం, యాన్సెన్, కేశవ్ మహారాజ్, కార్బిన్ బోష్ దక్షిణాఫ్రికాలో కీలకమైన ప్లేయర్ లు గా ఉన్నారు. డికాక్, బ్రిట్జ్ కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్ వంటి ప్లేయర్ల నుంచి భారత బౌలర్లకు సవాలు ఎదుర్కోవడం ఖాయం.. గాయం వల్ల రబాడ వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు.. అయితే యాన్సన్, బర్గర్, ఎంగిడి, బోష్ తో పేస్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది.
రాంచీ మైదానం లో ఇప్పటివరకు 5 వన్డేలు జరిగాయి. ఇందులో ఒక్కసారి మాత్రమే మూడు వదల స్కోర్ నమోదయింది. ఇక్కడి పిచ్ కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఆదివారం నాటి మ్యాచ్లో 270 నుంచి 280 మధ్య స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. 300 స్కోర్ గనుక చేస్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. స్పిన్ బౌలర్లు ఇక్కడ ప్రభావం చూపిస్తారు. రాత్రి సమయంలో మంచు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి.. టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.