Pemmasani Chandrasekhar : 2014, 2019 లో లాగా బంపర్ మెజారిటీ రాకపోవడంతో.. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరాల్సి వచ్చింది. బిజెపి ఆశించినట్టుగా స్థానాలు దక్కకపోవడంతో.. ఇతర మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.. ఇందులో భాగంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత… కాంగ్రెసేతర వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. దీంతో నెహ్రూ సరసన నిలిచారు నరేంద్ర మోదీ.. ప్రధాని ప్రమాణ స్వీకార అనంతరం భాగస్వామ్య పార్టీల నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు. 2024 ఎన్నికలలో గెలిచిన ధనిక ఎంపీలలో చంద్రశేఖర్ ఒకరు.. ఎన్నికల సమయంలో ఈయన ప్రకటించిన తన అఫిడవిట్ లో 5,700 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు..
ఇటీవల ఎన్నికల్లోనే చంద్రశేఖర్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 3.4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.. పెమ్మసాని వయస్సు ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఈయన గుంటూరులోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు.. ఆ తర్వాత అమెరికాలో పెన్సిల్వేనియాలోని గీసింజర్ మెడికల్ సెంటర్లో ఉన్నత విద్యను అభ్యసించారు.. అనంతరం జాన్స్ హాప్ కిన్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేశారు. వైద్యుడిగా అమెరికాలో సేవలు అందించారు.. ఇది మాత్రమే కాకుండా, పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతకు U world పేరుతో ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారం స్థాపించారు. దీని ద్వారా వారు సులువుగా అనేక అంశాలపై పట్టు సాధించవచ్చు. పరీక్షలు కూడా రాయవచ్చు..
పెమ్మసాని రాజకీయ ఆరంగేట్రం చేసిన వెంటనే ఎంపీగా గెలవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకరకంగా రికార్డు. అమెరికాలో వైద్యుడిగా సేవలందించి గొప్ప పేరు తెచ్చుకున్న పెమ్మసాని.. ఎంపీగా, మంత్రిగా అదే స్థాయిలో గౌరవం సాధిస్తారని గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన అనుభవం, సేవ చేయాలనే నిబద్ధత గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమూలంగా మార్చుతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు.. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోనని చెప్పడంతో.. చంద్రశేఖర్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే చంద్రశేఖర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలో ఒక రోడ్డు మ్యాప్ రూపొందించుకున్నారు. దానిని ప్రజలకు అర్థమయ్యేలా ఎన్నికల సమయంలో చెప్పగలిగారు. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో టిడిపి గెలవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం మెండుగా ఉండడంతో ఆయన విజయం నల్లేరు మీద నడక అయింది.. ఆయనకు మంత్రిగా అవకాశం రావడంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ రూపురేఖలు మారతాయని ఇక్కడి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.