India Vs Pakistan T20 World Cup 2026: పాకిస్తాన్ జట్టుతో భారత ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్ కు ఇండియన్ ఫ్యాన్స్ భారీగా హాజరవుతుంటారు. టికెట్లు ముందుగానే కొనుగోలు చేసుకుని.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ను చూసేందుకు టీమిండియా అభిమానులకు విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఇటీవల ఆసియా కప్ లో అది మరొకసారి నిరూపితమైంది.
టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో ఆడే మ్యాచ్ ను తాము రద్దు చేసుకుంటున్నామని ఇటీవల పాకిస్తాన్ ప్రకటించింది. ఇక అప్పట్నుంచి అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ తటస్థ వేదిక లో తలపడ్డాయి. ఆసియా కప్ లో కూడా దుబాయిలో పోటీపడ్డాయి. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లలో వివిధ వేదికలలో ఆడాయి. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని భారత అభిమానులు ఊహించలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించిన నేపథ్యంలో అభిమానులలో ఆందోళన మొదలైంది.
కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు చాలామంది అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కొందరు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అక్కడ హోటల్ గదులను కూడా ఆన్ లైన్ లో అద్దెకు తీసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం.. భారత జట్టుతో జరిగే మ్యాచ్ విషయంలో ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతూ ఉండడంతో.. అభిమానులలో ఆందోళన మొదలైంది. విమానాయాన సంస్థలు కూడా ఒక రకమైన డోలాయమాన పరిస్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంటే అభిమానులు కొనుగోలు చేసిన టికెట్లకు సార్ధకత లభిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వారికి ఆర్థికంగా నష్టం ఎదురవుతుంది. ఒకవేళ గనుక అదే జరిగితే భారత అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు.
కొలంబోలో మ్యాచ్ చూసేందుకు భారీగా టీమిండియా అభిమానులు వస్తారని శ్రీలంక క్రికెట్ బోర్డు అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే ముందుగానే టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే శ్రీలంక క్రికెట్ బోర్డుకి మాత్రమే కాకుండా.. విమానయాన సంస్థలు.. హోటళ్లకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అంటే కేవలం బ్రాడ్కాస్టర్లకు.. ఐసీసీకి. . స్థానిక క్రికెట్ బోర్డుకి మాత్రమే కాకుండా. . అనేక సంస్థలకు ఆదాయం లభిస్తుంది. టూరిజం పరంగా భారీగా కొనుగోలు జరుగుతుంటాయి. కానీ, మ్యాచ్ రద్దు అయితే మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.