India Vs Pakistan T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. కొలంబో వేదికగా ఆదివారం సాయంత్రం నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. అనేక ఉద్రిక్తతలు.. ఉత్కంఠ ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
సాధారణంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో పరుగుల వరద సాగుతూ ఉంటుంది. రెండు జట్లలో కూడా భీకరమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో పరుగుల ప్రవాహం కొనసాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత మ్యాచ్ ల లో కూడా భారీగా పరుగులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పరుగుల ప్రవాహం ఖాయమని అంచనాలు ఉన్నప్పటికీ.. అది సాధ్యమయ్యే విధంగా కనిపించడం లేదు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు కొలంబో వేదిక. కొలంబో మైదానం బౌలింగ్ కు విపరీతంగా సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ స్పిన్ బౌలర్లు పండగ చేసుకుంటారు. భారత జట్టుకు వరుణ్ చక్రవర్తి రూపంలో అత్యంత మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. పాకిస్తాన్ జట్టుకు ఉస్మాన్ తారిఖ్ రూపంలో కూడా వజ్రాయుధం లాంటి బౌలర్ ఉన్నాడు. కొద్ది నెలల క్రితం జరిగిన ఆసియా కప్ లో వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వరుణ్ చక్రవర్తి నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి.. ఏడు పరుగులు ఇచ్చాడు. మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. వరుణ్ తో పాటు అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ స్పిన్ బాధ్యతను పంచుకోబోతున్నాడు.
ఈ పిచ్ ను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ అర్ష్ దీప్ సింగ్ కు విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో కులదీప్ యాదవ్ ను తీసుకుంది. బుమ్రా కు తోడుగా హార్దిక్ పాండ్యా, శివం దుబే ఉన్నారు. వీరిద్దరూ ఆల్ రౌండర్లు కావడంతో టీమిడియాకు ఇబ్బంది లేదు.
పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిఖ్ కీలక బౌలర్ గా ఉన్నాడు. ఇటీవల కాలంలో అతడు తీవ్రమైన చర్చల్లో ఉన్నాడు. అతడు బంతిని వదిలే సమయంలో కొంచెం ఆగుతాడు. ఆ తర్వాత తనదైన శైలిలో బంతిని విసిరేస్తాడు. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. ఇతడికి తోడు అబ్రార్, షాదాబ్ ఖాన్, ఆయుబ్ వంటి వారు మిస్టీరియస్ స్పిన్ బౌలింగ్ వేస్తారు. అయితే పాకిస్తాన్ జట్టు నవాజ్ ను పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో షాహిన్ ఆఫ్రిది, అష్రాఫ్ తో అటు సల్మాన్ మీర్జాను కూడా జట్టులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.