India Vs Pakistan: భారత్ పవర్ చూపిస్తే తట్టుకోవడం పాక్ కు కష్టమే!

ఆసియా కప్‌ సూపర్‌–4 దశలో టీమిండియా సూపర్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది.

Written By: Raj Shekar, Updated On : September 12, 2023 2:24 pm

India Vs Pakistan

Follow us on

India Vs Pakistan: ఆసియాకప్‌ –2023లో లీగ్‌ దశలో ఓటమి లేకుండా దూసుకుపోతున్న పాకిస్తాన్.. భారత్‌ను కూడా కొంచెం కంగారు పెట్టింది కానీ.. సూపర్‌–4 దశలో మాత్రం భారత్‌ ధాటికి కుదేలైపోయింది. టీమిండియా పరుగుల తుపాన్‌లో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడిపోయింది. 228 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది.

రికార్డు విజయం..
ఇక ఆసియా కప్‌లో రోహిత్‌ సేన రికార్డు విజయం అందుకుంది. వర్షం వల్ల రెండు రోజులపాటు సాగిన మ్యాచ్లో ఆద్యంతం భారతే ఆధిపత్యం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అర్ధశతకాలు సాధిస్తే.. తర్వాత వచ్చిన ఇద్దరూ శతక మోత మోగించారు. తర్వాత బౌలింగ్‌ లోనూ భారత్‌ జోరుకు ప్రత్యర్థి నిలవలేకపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరూ 30 దాటలేదు. ఒక్క 50 భాగస్వామ్యమూ నమోదు కాలేదు. మొత్తంగా కొలంబోలో టీమిండియాకు పాక్‌ నుంచి కనీస పోటీ లేదు. చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి మంగళవారం ఆతిథ్య శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది రోహిత్‌ సేన.

చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసి..
ఆసియా కప్‌ సూపర్‌–4 దశలో టీమిండియా సూపర్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఆదివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 147/2తో నిలవగా.. రిజర్వ్‌ డే అయిన సోమవారం ఇన్నింగ్స్‌ కొనసాగించి మరో వికెట్‌ కోల్పోకుండా 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌; 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో అజేయంగా నిలిచారు.

ఛేదించలేక చతికిలబడి..
ఛేదనలో స్పిన్నర్‌ కులీప్‌ యాదవ్‌ (5/25) ధాటికి విలవిలలాడిన పాక్‌ 32 ఓవర్లలో కేవలం 128 పరుగులకే పరిమితమైంది. గాయాల కారణంగా హారిస్‌ రవూఫ్, నసీమ్‌ షా బ్యాటింగ్‌ చేయలేదు. 27 పరుగులు చేసిన జమానే ఆ జట్టులో టాప్‌ ఆ స్కోరర్‌. భారత్‌ తన తర్వాతి సూపర్‌–4 మ్యాచ్లో మంగళవారం శ్రీలంకను ఢీకొంటుంది.

వికెట్‌ కాపాడుకునేందుకే..
వర్షం మ్యాచ్‌తో దోబూచులాడుతోంది. ఆట ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో ఛేదన ఆరంభించిన పాక్‌.. డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే ముందంజలో నిలిచేందుకు ధాటిగా ఆడుతుందనిపించింది. కానీ ఆ జట్టుకు ఆ అవకాశమే ఇవ్వలేదు భారత బౌలర్లు. బుమ్రా బంతి బంతికీ పరీక్ష పెట్టడంతో పరుగులు చేయడం సంగతటుంచి వికెట్‌ కాపాడుకోవడం పాక్‌ ఓపెనర్లకు కష్టమైపోయింది. తడబడుతూ సాగిన ఇమాముల్‌(9).. బుమ్రా వేసిన అయిదో ఓవర్లో స్లిప్‌లో దొరికిపోయాడు. ఈ దశలో జమాన్‌తో కలిసి బాబర్‌(10) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ స్కోరు ముందుకు కదల్లేదు. బాబర్‌ను హార్దిక్‌ బౌల్డ్‌ చేయడంతో పాక్‌కుగట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాక్‌ 44/2తో ఉన్న దశలో వర్షం వల్ల ఆట ఆగింది.

అదరగొట్టిన కుల్దీప్‌..
గంటన్నర విరామం తర్వాత ఆట తిరిగి మొదలైందో లేదో.. రిజ్వాన్‌ (2)ను పెవిలియన్‌కు పంపించాడు శార్దూల్‌. ఆ తర్వాత మొదలైంది కుల్దేప్‌ మాయ. బంతి ఎక్కడ పడుతుందో, ఎటు తిరుగుతుందో తెలియనట్లుగా సాగిన అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. జమాన్‌ను అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేసిన కుల్దేప్‌.. ఆ తర్వాత పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సైకిల్‌ స్టాండ్‌ మార్చేశాడు. నిలబడితే ఎల్బీ లేదా బౌల్డ్‌.. షాట్‌ ఆడితే క్యాచ్‌ అన్నట్లు తయారైంది పరిస్థితి.

మరో బౌలర్‌కు చాన్స్‌ ఇవ్వకుండా..
వరుసగా 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్దేప్‌.. మరో బౌలర్‌కు అవకాశమివ్వకుండా చివరి 5 వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు. జమాన్‌ తర్వాత అఘా సల్మాన్‌(23), ఇప్తికార్‌(23) మాత్రమే ఆ జట్టు చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.