India Vs New Zealand 5th T20I: న్యూజిలాండ్ జట్టుతో శనివారం త్రివేండ్రం వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 271 పరుగులు చేసింది. కిషన్ 103, సూర్య కుమార్ యాదవ్ 63, హార్దిక్ పాండ్యా 42 పరుగులు చేశారు. ఫెర్గు సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ చేజింగ్ మొదలుపెట్టింది. 225 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అలెన్ 80 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సోది 33, రవీంద్ర 30 పరుగులు చేశారు. అర్ష్ దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ సి ఫర్ట్ (5) సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ.. అలెన్, రవీంద్ర అదరగొట్టారు. భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. కేవలం 9 ఓవర్లలోనే న్యూజిలాండ్ స్కోరును 117 పరుగుల దాకా తీసుకెళ్లారు. ఈ దశలో అలెన్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కేవలం 38 బంతుల్లోనే అతడు ఎనిమిది ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు.
అతడి దూకుడు చూస్తే టీమిండియా ఓడిపోవడం ఖాయంగా కనిపించింది.. సూర్య కుమార్ యాదవ్ మార్చి మార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్ అద్భుతమైన బంతివేసి అలెన్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలెన్, రవీంద్ర అవుట్ అయిన తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇదే ఊపులో అక్షర్ ఫిలిప్స్ (7), ఫెర్గు సన్ (3) ను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయింది. అర్ష్ దీప్ సింగ్ మిచెల్(26), శాంట్నర్(0), జమిసన్(9) ను అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు ఇక ఏ దశలో కోలుకోలేకపోయింది
మొదటి 10 ఓవర్లలో టీమిండియాను దాటి పరుగులు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ఆ తర్వాత పూర్తిగా తడబడ్డారు. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ వేసిన 12 ఓవర్ న్యూజిలాండ్ జట్టు ఓటమిని దాదాపు ఖాయం చేసింది. ఈ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్ సింగ్.. ఒక పరుగు మాత్రమే ఇవ్వడం విశేషం. ఓటమి ఖాయం అనుకుంటున్న మ్యాచ్లో అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ అదరగొట్టారు. ఇద్దరూ 8 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.