IND vs NZ : భారత్ ఈ ఏడాదిలో వరుసగా రెండో సిరీస్ గెలిచింది. శ్రీలంకలో వైట్ వాష్ చేసిన టీం ఇండియా న్యూజిలాండ్ పై కూడా అదే జోరు కొనసాగించింది.. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో గెలుపొందిన ఉత్సాహంతో రెండో వన్డేలో కూడా అదే ప్రదర్శన కనబరిచింది. మొదటి వన్డేలో బ్యాట్స్ మెన్ ప్రతిభ కనబరిస్తే… రెండో వన్డేలో బౌలర్లు ఆ పని పూర్తి చేశారు. మొత్తానికి 2_0 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్నారు.

టాస్ గెలిచి..
రాయపూర్ లో టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.. శర్మ అంచనాలకు తగ్గట్టుగానే భారత బౌలర్లు షమీ, సిరాజ్, కులదీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఠాకూర్, న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. 108 పరుగులకే కుప్పకూల్చారు. ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంట్నర్ కొద్దిసేపు బ్యాట్ ఝళిపించకపోయి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగులకే కుప్పకూలేది.
రెండు వికెట్లు కోల్పోయి
బౌలింగ్ కు సహకరిస్తున్న ఈ పిచ్ పై చేజింగ్ కు దిగిన భారత బ్యాట్స్మెన్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించారు. రోహిత్ శర్మ తన జోరు ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. హైదరాబాదులా కాకుండా ఏకంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గిల్ కూడా 40 పరుగులు చేశాడు.. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత…బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన
ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ లాంఛనం పూర్తి చేశాడు. మొత్తానికి టీం ఇండియా న్యూజిలాండ్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
లెక్క సరిపోయింది
గత ఏడాది చివరిలో న్యూజిలాండ్ లో పర్యటించిన భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న సిరీస్ ను గెలవడం ద్వారా లెక్క సరిచేసినట్టు అయింది. కాగా న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టులో అరివీర భయంకరమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ ఇవాళ భారత బౌలర్ల ముందు తేలిపోయారు. గల్లీ స్థాయి క్రికెట్ ఆడి స్వల్ప స్కోర్ నమోదు చేశారు.