India Vs India A Practice Match: నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. ఈసారి భారత్ – ఆస్ట్రేలియా ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతుంది.. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ వైట్ వాష్ కు గురి కావడంతో టీమిండియా పై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మైదానాలపై అవగాహన పెంచుకోవడానికి టీమిండియా ముందుగానే బయలుదేరింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాకా మైదానంలో భారత్ – ఏ ఆటగాళ్లతో భారత స్టార్ ఆటగాళ్లు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ పూర్తిగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ భారత బ్యాటర్లకు చుక్కలు చూపించే ప్రమాదం లేకపోలేదు. అందువల్లే ముందుగానే అప్రమత్తమైన బీసీసీఐ ఆస్ట్రేలియా తో సిరీస్ కు ముందే టీమిండియా ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలో భారత జట్టు – ఏ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లకు వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తోంది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదు.
విఫలమయ్యారు
శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన పేలవమైన ఫామ్ కొనసాగించాడు. మన పూర్వపు లయను అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. ఇది విరాట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. రిషబ్ పంత్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అన్ని నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
ఆ పాత కోహ్లీ ఎక్కడ?
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 15 పరుగులు చేసి సౌకర్యవంతంగానే కనిపించాడు. అతడు అద్భుతమైన కవర్ డ్రైవ్ లు ఆడి ఆకట్టుకున్నాడు.. అయితే షాట్ ఎంపికలో విఫలమయ్యాడు. ఫలితంగా అవుట్ అయ్యాడు. పేస్ బౌలర్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో సెకండ్ స్లిప్ లో ఉన్న ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఈ వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రాహుల్ గాయపడినట్టు తెలుస్తోంది. విరాట్ కు స్కానింగ్ చేశారని.. ఆ తర్వాత అతడు మ్యాచ్ లో ఆడాడని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. “టీమిండియా స్టార్ ఆటగాళ్లు విఫలమయ్యారు. సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారని” ఆస్ట్రేలియా మీడియా ప్రముఖంగా వ్యాఖ్యానించింది.