India Vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ రాంచి వేదికగా నాలుగో టెస్ట్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో ఆకాష్ దీప్ సింగ్ కు అవకాశం ఇచ్చింది. ఆకాష్ తో పాటు సిరాజ్ వంటి పేస్ బౌలర్ మాత్రమే కాకుండా.. అశ్విన్, జడేజా, కుల దీప్ యాదవ్ వంటి ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరాజ్, అరంగేట్ర ఆటగాడు ఆకాష్ తో భారత్ బౌలింగ్ ప్రారంభించింది. 9.1 ఓవర్ల దాకా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వన్డే తరహాలో ఆడారు. ముఖ్యంగా క్రావ్ లే 42 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 1సిక్స్ ఉన్నాయి. సిరాజ్, ఆకాష్ బౌలింగ్లో అతడు అత్యంత స్వేచ్ఛగా ఆడాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించలేదు.
ఇక ఆరంగేట్ర బౌలర్ ఆకాష్ తన సత్తా చాటాడు. 9.2 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ జట్టు స్కోరు 47 పరుగులుగా ఉన్నప్పుడు బెన్ డకెట్ ను ఔట్ చేశాడు.. ఆకాష్ వేసిన బంతిని తప్పుగా అర్థం చేసుకున్న డకెట్ దాన్ని భారీ షాట్ ఆడబోయి కీపర్ దృవ్ చేతికి చిక్కాడు. దీంతో ఆకాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి వికెట్ సాధించాడు.. అనంతరం ఒక బంతి వ్యవధిలోనే అంటే 9.4 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు స్కోరు అదే 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓలీ పోప్ ను ఆకాష్ అవుట్ చేశాడు. ఆకాష్ వేసిన బంతి వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పోప్ నిరాశతో వెనుతిరిగాడు. అతడు పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆరంగేట్ర మ్యాచ్ లోనే రెండు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను ఆకాష్ పడగొట్టాడు.
పోప్, డకెట్ ఇటీవల ఇంగ్లాండ్ జట్టు తరఫున మొదటి, మూడు టెస్ట్ మ్యాచ్ లలో సెంచరీలు సాధించారు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తమదైన ఆటతీరుతో అలరించారు. ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంలో పోప్ కీలక పాత్ర పోషించాడు..మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డకెట్ కీలకమైన ఆట ఆడాడు. సెంచరీ సాధించి అలరించాడు. ఇంగ్లాండ్ జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాళ్లను అవుట్ చేసి భారత్ పై చేయి సాధించేలా చేశాడు.. మరో వైపు భారత బౌలర్ల పై ఎదురు దాడి చేస్తున్న జాక్ క్రావ్ లే ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ జట్టును ఆకాష్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఇలా తన తొలి ఆరెంగేట్ర మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి ఆకాష్ రికార్డు సృష్టించాడు. 11.5 ఓవర్ వద్ద ఇంగ్లాండ్ జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు జాక్ క్రావ్ లే ను ఆకాష్ పదునైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8 పరుగుల దూరంలో ఆఫ్ సెంచరీ కోల్పోయి జాక్ క్రావ్ లే నిరాశతో పేలియన్ చేరుకున్నాడు. మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అని చెప్పినప్పటికీ.. రాంచి వేదికపై ఆకాష్ తన పేస్ బౌలింగ్ తో ఇప్పటికే మూడు వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతం జానీ బెయిర్ స్టో(33), రూట్(11) క్రీజ్ లో కొనసాగుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ జట్టు 100 పరుగులు చేసింది.