https://oktelugu.com/

IND Vs ENG: ఆ ముగ్గురు నిలబడి ఉంటే.. భారత్ రేంజ్ మరో విధంగా ఉండేది

తొలి వికెట్ కు జైస్వాల్, రోహిత్ శర్మ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత గిల్, రోహిత్ శర్మ రెండో వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 8, 2024 / 05:04 PM IST

    IND Vs ENG

    Follow us on

    IND Vs ENG: మొత్తానికి ధర్మశాల టెస్టులో భారత జట్టు పట్టు బిగించినట్టే. ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు.. ఈ మ్యాచ్ ను అనామకంగా భావిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ గెలుపు కూడా WTC ర్యాంకింగ్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. రోహిత్ సేన ఈ మ్యాచ్ ను కూడా అత్యంత సీరియస్ గా తీసుకుంది. అందుకే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టును 218 పరుగులకు ఆల్ అవుట్ చేసింది.. అనంతరం మొదటి ఇన్ని ప్రారంభించిన ఇండియా.. యశస్వి జైస్వాల్ ( 57), కెప్టెన్ రోహిత్ శర్మ (103), గిల్(110), పడిక్కల్(65), సర్ప రాజ్ ఖాన్(56) ధాటికి 473 పరుగులు చేసింది.. ఇప్పటికీ ఇంగ్లాండ్ జట్టుపై 255 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.

    ఆ ముగ్గురు నిలబడి ఉంటే

    తొలి వికెట్ కు జైస్వాల్, రోహిత్ శర్మ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత గిల్, రోహిత్ శర్మ రెండో వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రోహిత్ ఔట్ అయిన తర్వాత మూడో వికెట్ కు పడిక్కల్, గిల్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేశారు. గిల్ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సర్ప రాజ్ ఖాన్ పడిక్కల్ కు జత కావడంతో వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 97 పరుగులు జోడించారు. సర్ప రాజ్ ఖాన్ అవుట్ అయ్యేసరికి ఇండియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 376 పరుగులు.. ఆ తర్వాత రవీంద్ర జడేజా క్రీజ్ లోకి వచ్చాడు. జట్టు స్కోరు 403 పరుగుల వద్ద ఉన్నప్పుడు పడిక్కల్ ఔట్ అయ్యాడు.

    ప్రభావం చూపించలేకపోయారు

    పడిక్కల్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి ధృవ్ జురెల్ వచ్చాడు. రాంచీ మైదానంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ఈ మ్యాచ్ లోనూ మెరుస్తాడు అనుకున్నారు. మరోవైపు రాజ్ కోట్ టెస్టులో క్లిష్టమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడని జట్టు సభ్యులు భావించారు. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరూ చెరి 15 పరుగులు చేసి జట్టు స్కోరు 427 వద్ద ఉన్నప్పుడు నాలుగు బంతుల వ్యవధిలో అవుట్ అయ్యారు.. దీంతో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో ఒక్కసారిగా షాక్ వాతావరణం నెలకొంది. వీరిద్దరిట్లో ఎవ్వరు ఒక్కరు క్రీజ్ లో ఉన్నా భారత్ మరిన్ని ఎక్కువ పరుగులు సాధించేది. జట్టు స్కోరు 428 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు వ్యవధిలోనే ఇండియా మూడు వికెట్లు పోగొట్టుకుంది. అదే సమయంలో భారీ స్కోరు సాధించే అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంది.

    ఆధిక్యం ఎంతంటే..

    ఒక పరుగు వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా జట్టును కులదీప్ యాదవ్, బుమ్రా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిదో వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. కులదీప్ యాదవ్ (27), బుమ్రా(19) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 255 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు సాధించాడు. హార్ట్ లీ 2 వికెట్లు, అండర్ సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.