
India vs England 3rd Test: భారత బ్యాట్స్ మెన్ మూడో రోజు ఎంతగా పోరాడారో.. 4వ రోజులు అంతే స్థాయిలో బ్యాట్లు ఎత్తేశారు. తొలి గంటలోనే చాప చుట్టేశారు. ఇంగ్లండ్ కు ఇన్నింగ్స్ 76 పరుగుల విజయాన్ని పువ్వుల్లో పెట్టి అందించారు. ఈక్రమంలోనే సిరీస్ ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. భారత్ కు ఘోర పరాజయాన్ని చవిచూపించింది.
ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత బ్యాట్స్ మెన్ పేలవ ప్రదర్శనతో భారత్ జట్టు ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమికి ఖచ్చితంగా భారత బ్యాట్స్ మెన్ వైఫల్యం కారణంగా చెప్పొచ్చు. 212/2 పటిష్టమైన స్థితిలో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ను ఇంగ్లండ్ జట్టు చావుదెబ్బతీసింది. తొలి సెషన్ లోనే ఏకంగా ఎనిమిది వికెట్లను నేలకూల్చింది. భారత బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఏ దశలోనూ పోరాటం చేయలేదు. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల నుంచే వికెట్ల పతనం ప్రారంభమైంది.
ఇంగ్లండ్ బౌలర్ రాబిన్ సన్ 5 వికెట్లతో రెచ్చిపోయి బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్ ఎప్పటిలాగానే ఆఫ్ సైడ్ బంతులను వేటాడి వికెట్లు పారేసుకున్నారు.
పూజారా (91) ఔట్ తో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత కోహ్లీ 55, రహానే 10, పంత్ 1 తో టెయిలండర్లందరూ క్యూ కట్టడంతో అసలు పోరాటం లేకుండా ఇండియా ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం భారత్ ను చావుదెబ్బ తీస్తోంది. కెప్టెన్ కోహ్లీ, రహానే, పంత్ లు అస్సలు రాణించకపోవడమే భారత్ ఓటమికి కారణమైంది. పంత్ అయితే ఔట్ కావడానికే ఆడినట్టుగా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్ సన్ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్ చిత్తుగా ఓడిపోయింది. నిన్న రోహిత్, పూజారా పోరాడారు. ఈరోజు కనీసం ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
నిన్న పూజారా, కోహ్లీ ఆటచూస్తే నాలుగోరోజు భారీ స్కోరు సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ పూజారా ఔట్ తో అంతా కథ మారింది. బ్యాట్స్ మెన్ క్యూ కట్టడంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది.