
బ్యాట్ కు, బంతికి మధ్య.. వ్యూహాలకు అతీతంగా జరిగే యుద్ధమిది. ఒక్క బంతిని బ్యాట్సమెన్ డిఫెన్స్ చేశాడంటే అదో నేరంగా పరిగణించే స్థితి. బౌలర్ ఒక్క బౌండరీ సమర్పించుకున్నాడంటే దోషిగా నిలబెట్టే పరిస్థితి! అందుకే.. ధనాదన్.. ఫటాఫట్ అనిపించేందుకే ప్రయత్నిస్తుంటారు ఆటగాళ్లు. ఇందుకే.. గత రికార్డులతో సంబంధం లేకుండా సరికొత్త ఫలితాలు నమోదవుతుంటాయి. అలాంటిది.. టీ-20 ఫార్మాట్లో ప్రపంచ అగ్రశ్రేణి జట్లు పోటీ పడితే ఆ మజా ఎలా ఉంటుంది? అది క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే తెలుస్తుంది. నేటినుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య టీ-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. ఏ జట్టు బలం ఎంతన్నది పరిశీలిస్తే…
Also Read: పటిష్ట ఇంగ్లండ్ తో నేడే టీమిండియా తొలి టీ20.. గెలుపెవరిది? టీం ఎలా ఉండనుంది?
ఇది సాధారణ ద్వైపాక్షిక సిరీస్ అయినప్పటికీ.. రెండు జట్లకు అత్యంత కీలకం, ప్రతిష్టాత్మకం. కారణం ఏమంటే.. టీ-20 ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కాబట్టి! అది కూడా భారత్ లోనే వరల్డ్ కప్ జరగబోతోంది కాబట్టి! దీంతో.. సన్నాహక సిరీస్ గా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. ప్రపంచకప్ ముందు ఇలాంటి అవకాశం రావడం మంచి పరిణామం అని ఇంగ్లండ్ అంటుండగా.. తమ బృందం లోటుపాట్లు చెక్ చేసుకునేందుకు ఈ సిరీస్ చక్కటి అవకాశం అంటోంది టీమిండియా. దీంతో.. ఈ సిరీస్ ఇరు జట్లకూ అత్యంత ప్రధానంగా మారింది.
మరి, ఎవరి బలం ఎంత అనే లెక్కలు తీసినప్పుడు రెండు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే.. భారత్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. తుది జట్టులో చోటుకోసం భారీ పోటీ నెలకొనడమే ఇక్కడ సమస్య. ఇందులో మొదటిది ఓపెనింగ్. ఎప్పుడై, ఎక్కడైనా దంచికొట్టడమే పనిగా పెట్టుకునే శిఖర్ ధావన్ ను తీసుకోవాలా? వద్దా? అనేది క్లిష్టంగా మారింది. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న గబ్బర్ ను తీసుకుంటే.. మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ ను ఎక్కడ ఆడించాలన్నది సమస్య. అతనికి మిగిలేది నాలుగో స్థానమే. అక్కడ ఆడించాలని టీం డిసైడ్ అయితే.. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ కు ఎర్త్ పడుతుంది. మరి, ఏం జరుగుతుంది అన్నది చూడాలి.
మొతేరా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ కు చోటివ్వాల్సిన పరిస్థితి. బౌలింగ్ విభాగంలో నటరాజన్ లేడు కాబట్టి.. భువీకి చోటు ఖాయమైనట్టే. స్పిన్ ఆత్రను చాహల్ పోషిస్తాడు. రెండో పేసర్ కు మాత్రం గట్టిపోటీ ఉంది. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, నవదీప్ సైనిలో ఒక్కరికే ఛాన్స్. మరి, ఎవరికి చోటు దక్కుతుందన్నది ఉత్కంఠగా మారింది.
Also Read: టీ 20 వరల్డ్‌కప్ జట్టులో భారీ మార్పులు..?
ఇక, ఇంగ్లండ్ పరిస్థితి చూస్తే.. మోర్గాన్, స్టోక్స్, బట్లర్, మలన్ వీరబాదుడు బాదేస్తారు. చివరకు మొయిన్ అలీ, జోఫ్రా కూడా ప్రతాపం చూపగలరు. సామ్ కరన్, మొయిన్ అలీ వంటి ఆల్ రౌండర్లు ఆ జట్టుకు అదనపు బలం. వీరితోపాటు ఆర్చర్, మార్క్ వుడ్, జో్డాన్, రషీద్ వంటి స్పెషలిస్టులతో ఆ జట్టు మంచి లైనప్ తో ఉంది. మరి, బలాబలాల విషయంలో పటిష్టంగా ఉన్న ఈ రెండు జట్ల పొట్టి సమరం ఎలా మొదలవుతుంది? ఎలా ముగుస్తుంది? అన్నది చూడాలి. మూడు మ్యాచుల సిరీస్ లో అన్నీ.. రాత్రి 7.గంటలకు ప్రసారం కానున్నాయి.