India Vs Bangladesh: అర్ష్ దీప్ ధాటికి బంగ్లా పులుల బెంబేలు.. భారత్ కు అదిరిపోయే విజయం

బంగ్లా ఇన్నింగ్స్ ప్రారంభంలో తొలి ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ సౌమ్య సర్కార్ (0) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లోనే ప్రమాదకరమైన లిటన్ దాస్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 7:46 am

India Vs Bangladesh

Follow us on

India Vs Bangladesh: టి20 ప్రపంచ కప్ -24 ప్రారమానికి ముందు రోహిత్ సేనకు అదిరిపోయే ఆరంభం లభించింది.. శనివారం బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఏకంగా 60 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. రిషబ్ పంత్ 53 పరుగులతో మైదానంలో సునామీని సృష్టించాడు. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా రిషబ్ పంత్ మునుపటిలాగా ఆడాడు. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత అతడు టీమిండియా జెర్సీని ధరించాడు. అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.. సంజు సాంసన్ (1), శివం దుబే(14) నిరాశపరిచినప్పటికీ.. పంత్ ఇన్నింగ్స్ ముందు వారి పేలవ ఇన్నింగ్స్ గాలికి కొట్టుకుపోయాయి. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మహమ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం తలా ఒక వికెట్ పడగొట్టారు.

183 పరుగుల విజయ లక్ష్యం తో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి పరాజయం పాలయింది. అర్ష్ దీప్ సింగ్ (2/12) , శివం దుబే(2/10) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్ కు వరుస కట్టారు. మహమ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్), షకిబుల్ హసన్ (28) టాప్ స్కోరర్ లు గా నిలిచారు.. వీరిద్దరూ ఆరో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లేకుంటే బంగ్లాదేశ్ ఓటమి మరింత దారుణంగా ఉండేది. సిరాజ్ (1/17), హార్దిక్ పాండ్యా (1/30), అక్షర్ పటేల్ (1/10) బుమ్రా(1/12) కూడా మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేశారు.

బంగ్లా ఇన్నింగ్స్ ప్రారంభంలో తొలి ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ సౌమ్య సర్కార్ (0) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లోనే ప్రమాదకరమైన లిటన్ దాస్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాంటో (0) ను సిరాజ్ వెనక్కి పంపించాడు. దీంతో పది పరుగులకే బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది.. హసన్(17) ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ పంపించాడు. దీంతో 41 పరుగులకే బంగ్లాదేశ్ ఐదు వికెట్లు కోల్పోయి.. తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్ కు ఏకంగా 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. హసన్ పని బుమ్రా పట్టగా, అర్థ సెంచరీకి దగ్గరగా ఉన్న మహమదుల్లా రిటైర్డ్ హర్ట్ గా ఔట్ వెనుతిరిగాడు.. ఈ క్రమంలో శివం దుబే తన ఆఖరి ఓవర్లో రిషబ్ హుస్సేన్, జాకీర్ అలీని అవుట్ చేసి.. భారత జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతడు డగ్ అవుట్ నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ వీక్షించాడు.. విరాట్ కోహ్లీ శనివారమే జట్టుతో కలిశాడు. అయితే అమెరికా వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా రోహిత్ శర్మ అతడికి విశ్రాంతి ఇచ్చాడు. ఫలితంగా ప్రాక్టీస్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ పై 60 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో.. టీమ్ ఇండియాకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. సంజు, శివం దుబే వంటి వారు విఫలమైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు టచ్ లోకి రావడం.. భారత్ తరఫున ఏడుగురు ఆటగాళ్లు బ్యాటింగ్ కు రావడం జట్టుకు సంతోషాన్నిస్తోంది.