India Vs Australia World Cup Final 2023: భారత్‌లో క్రికెట్ ఓ రిలీజియన్ అయితే.. ప్రపంచకప్ ఆ రిలీజియన్‌కు సంబంధించిన అతిపెద్ద పండుగ. ఇందులో విజేతగా నిలిస్తే భారత్‌లో జరుపుకునే అతిపెద్ద ఉత్సవం. అలాంటి పండుగ, ఉత్సవం ఇప్పటికే రెండుసార్లు జరుపుకున్నాం. 1983 కపిల్ లెడెవిల్స్ .. 2011 ధోనీ సేన కోట్లాది భారతీయుల కలను సాకారం చేశాయి. 1983 విజయం భారత క్రికెట్ దశ, దిశను మార్చగా.. 2011 గెలుపు దేశంలో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. అనామక జట్టుతో కపిల్ కప్పును అందించగా.. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ధోని దిగ్గజ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ట్రోఫీ సాధించి పెట్టాడు. ఈసారి రోహిత్ పక్కా ప్రణాళికతో జట్టుకు మార్గనిర్దేశం చేస్తూ జట్టును ఆఖరి అంకానికి తీసుకొచ్చాడు. చివరి మెట్టు ఎక్కేస్తే కొత్త చరిత్రే.
మలుపు తిప్పిన 1983..
భారత క్రికెట్‌ను 1983 వరల్డ్ కప్ మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. విజయం జట్టులోని ఆటగాళ్లతో సహా ఎవరూ ఊహించనిదే. ప్రపంచకప్ కోసమని భారత ఆటగాళ్లు లండన్‌కు వెళ్లారు. కానీ వాళ్ల అసలు ప్రణాళిక వేరే. ముంబయి నుంచి న్యూయార్క్ (అమెరికా)కు విహార యాత్రకు వెళ్లాలని ఆటగాళ్లంతా ప్రణాళిక వేసుకున్నారు. ఎలాగూ ప్రపంచకప్ కూడా ఉంది కాబట్టి మధ్యలో లండన్‌లో ‘హార్ట్’ లాంటిది పెట్టుకున్నారు. కానీ తీరా ఇంగ్లాండ్‌కు వెళ్లాక అంతా తలకిందులైంది. కెప్టెన్ కపిల్‌దేవ్ పట్టుదల, త్మవిశ్వాసం, ధైర్యంతో అద్భుతమే జరిగింది. ఆ రోజుల్లో భారత జట్టుకు సాంకేతిక సహాయం లేదు.. జట్టు మేనేజర్ మాన్సింగ్ కోచ్ కూడా. అప్పటివరకు 1975, 1979లలో రెండు ప్రపంచకప్‌లు ఆడిన ఆడిన భారత్.. ఒకే ఒక్క మ్యాచ్లో నెగ్గింది. అది కూడా ఈస్ట్ ఆఫ్రికా మీద. అలాంటి రికార్డున్న భారత్‌పై ఎవరికీ ఏ అంచనాలు లేవు.
గెలుస్తాంటే నవ్వారట..
తొలి మ్యాచ్లో విండీస్‌పై గెలుస్తామని కపిల్ అంటే.. సహచరులందరూ నవ్వారట. అయితే జట్టులో కపిల్ నింపిన ప్రేరణ భారత క్రికెట్లో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తాను ఆడుతూ.. అందరినీ ఆడిస్తూ ముందుండి నడిపించాడు. క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తొలి మ్యాచ్లో విండీస్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేపై కపిల్‌దేవ్ 175 పరుగుల అద్వితీయ ఇన్నింగ్స్ మరో మైలురాయి. రెట్టించిన స్ఫూర్తితో భారత్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి ఫైనల్ చేరుకుంది. చివరికి ఫైనల్లోనూ విండీస్‌ను మట్టికరిపించిన భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది.
2011లో మహి అద్భుతం..
ఇక భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన 2011 ప్రపంచకప్ టీమిండియాకు ప్రత్యేకమే. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ సాధారణ మధ్య తరగతి యువకుడు.. భారత జట్టుకు ప్రపంచకప్‌ను అందించిన తీరు అద్భుతం. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్‌ను విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోని నాయకత్వ లక్షణాల్ని 2011 వరల్డ్ కప్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. సచిన్ సహా అనేకమంది సీనియర్లతో నిండిన జట్టును అతను నడిపించిన తీరు అమోఘం. రైనా కూడా జట్టులో ఉండటంతో బ్యాటింగ్ ఆర్డర్ లో తాను ఏడో స్థానానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో మంచి ఫాంలో ఉన్న ధోని.. శతకాలు, రికార్డులు, వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించలేదు. అన్నింటికీ మించి ఒత్తిడినంతా తనపై వేసుకుని ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడేలా చేశాడు.
కచ్చితమైన ప్రణాళికతో..
జట్టులోని ఆటగాళ్లలో ఎవరి నుంచి ఎలాంటి ప్రదర్శన రాబట్టాలో కచ్చితమైన ప్రణాళికతో ధోనీ ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ ధోని మేధస్సు, నాయకత్వ పటిమకు నిదర్శనం. సెహ్వాగ్, సచిన్, కోహ్లి పెవిలియన్ చేరగా.. ఆ సమయంలో ఫామ్‌లో ఉన్న యువరాజ్ కూడా ఔటైతే భారత్ కథ ముగిసేదే. తీవ్రమైన ఒత్తిడి.. కోట్లాది మంది భారతీయుల ఆశల్ని భుజాన మోసిన ధోని.. యువీ స్థానంలో అయిదో నంబరులో బ్యాటింగ్‌కు వచ్చాడు. శ్రీలంక బౌలర్లకు సింహస్వప్నంలా నిలిచాడు. గంభీర్ అండతో జట్టును గెలిపించాడు. సహజ సిద్ధమైన ప్రతిభ, ధైర్యం, తెగువ, నాయకత్వ లక్షణాలతో ధోని అనితర సాధ్యమైన ఘనతను అందుకున్నాడు.
రో’హిట్ .. ముందుండి..
కొండంత ఆత్మవిశ్వాసం.. పదునైన వ్యూహాల ఫలితమే.. తొలిసారిగా ఇప్పుడు భారత్ అజేయంగా ఫైనల్ చేరుకోవడం. ఆ ఘనతలో.. రోహితే ప్రధాన పాత్ర. కోహ్లి సహా జట్టులో చాలామంది అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కానీ అందరి కంటే ముందుగా బరిగీసి కొట్లాడుతుంది మాత్రం రోహిత్. కొత్త బంతిని.. ప్రత్యర్థుల భీకర పేస్‌ను ముందు ఎదుర్కొంటోంది అతడే. అత్యున్నత టెక్నిక్ కలిగిన రోహిత్ లాంటి బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉంటే డబుల్ సెంచరీలు కొట్టేయగలడు. కానీ అతని లక్ష్యం వేరు. తన రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. మొదటి బంతి నుంచే అతని బ్యాటు బంతిపైకి దూసుకెళ్తంది. ప్రత్యర్థి బౌలర్లను మానసికంగా కుంగిపోయేలా చేస్తూ.. వారి ఆత్మవిశ్వా సాన్ని దెబ్బతీస్తూ భారత మిడిలార్డర్‌కు మార్గం సుగమం చేస్తున్నాడు. ముందు అతను
దాడి చేసి ప్రత్యర్థి కోట ద్వారాన్ని బద్దలు కొడితే.. తర్వాత సైనికులు పనిపూర్తి చేస్తున్నారు.
శుభారంభం..
టీమిండియాకు రోహిత్–గిల్ శుభారంభం అందిస్తున్నారు. కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పిస్తున్నాయి. ఇక బౌలర్ల మార్పులు, ఫీల్డింగ్ మోహరింపుల్లో నూటికి నూరు శాతం మార్కులు రోహిత్‌కే.
నేడే ఆఖరు పరీక్ష..
ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా వ్యూహాన్ని అమలు చేసిన రోహిత్ ఆఖరి పరీక్ష ఆదివారమే. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ప్రపంచకప్ ఫైనల్లో కంగారూలను కొట్టడం అంత సులువు కాకపోవచ్చు. కాని తనదైన నాయకత్వ పటిమతో ఆకట్టుకుంటున్న రోహిత్ ‘ఆపరేషన్ కంగారూ’ వ్యూహాన్ని కూడా సిద్ధం చేసే ఉంటాడు. ఆ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేసి కప్పు ఒడిసిపడతాడా అన్నది చూడాలి.