India vs Australia T20I series: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక ధనిక బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతోంది. బిసిసిఐ ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని శాసిస్తోంది. ఐపీఎల్ వంటి లీగ్ ను నిర్వహిస్తూ సంచలనం సృష్టిస్తోంది. అటువంటి బీసీసీఐ సొంత ఆటగాళ్ల విషయంలో ఏమాత్రం కనికరం చూపడం లేదు.. ఎందుకంటే సిరీస్ ల మధ్య ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.
ఇటీవల టీమిండియా ఆసియా కప్ ఆడింది. ఆసియా కప్ ఫైనల్ పూర్తయిన తర్వాత కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఇది పూర్తయిన కొద్ది రోజులకే మళ్ళీ ఆస్ట్రేలియా సిరీస్ మొదలైంది. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించుకుని.. రేపటి నుంచి టి20 సిరీస్ ఆడనుంది. ఇటీవల వన్డే సిరీస్ లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు.. టి20 సిరీస్ లోను ఆడబోతున్నారు. ప్లేయర్లు సామర్థ్యంపరంగా తోపులు అయినప్పటికీ.. ఈ మాత్రం గ్యాప్ వైట్ బాల్ ఫార్మాట్లో సరిపోదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.. 2027 వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న తర్వాత బీసీసీఐ ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చిందని.. అందువల్లే ప్లానింగ్, వర్క్ లోడ్ విషయంలో విచిత్రంగా వ్యవహరిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఇటీవల వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ లో ఆడిన దాదాపు 11 మంది ప్లేయర్లు.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడేందుకు కంగారు గడ్డ మీద అడుగు పెట్టారు.. జాతీయ జట్టులో టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్ లో పూర్తిస్థాయిలో కొంతమంది ప్లేయర్లు మైదానాలకే పరిమితమవుతున్నారు. కనీసం వారు ఇంటి ముఖాలు కూడా చూడడం లేదు. ఇలా నిర్విరామంగా క్రికెట్ ఆడితే ప్లేయర్ల మీద విపరీతమైన వర్కులోడు పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో వారు గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. గిల్, అక్షర్, కులదీప్ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నారు. వీరు ముగ్గురు ఆసియా కప్ లో కేవలం 20 రోజుల వ్యవధిలో ఏడు మ్యాచ్ లు ఆడారు. అది ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో కులదీప్, గిల్ ఆడారు. ఆ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత కంగారు గడ్డ మీద అడుగు పెట్టారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు వారు ప్రయత్నిస్తుండగానే సిరీస్ మొదలైంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే వారిద్దరు ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక మూడు రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ మొదలు కాబోతోంది. గిల్, అర్ష్ దీప్, హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ టి20 సిరీస్లో ఆడబోతున్నారు. వాస్తవానికి వీరంతా కూడా వన్డే సిరీస్ లో ఆడారు. ఇలా తీరికలేకుండా క్రికెట్ ఆడితే ఆటగాళ్లు ఇబ్బంది పడడం ఖాయం. అంతేకాదు వ్యక్తిగతంగా వారి ప్రదర్శన కూడా అంతంతమాత్రంగా ఉండే అవకాశం ఉంది. అది జట్టు సాధించే ఫలితాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
కొంతమంది ప్లేయర్ల విషయంలో మాత్రం మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. వారిపై ఎటువంటి వర్క్ లోడ్ పడడం లేదు. ఉదాహరణకు బుమ్రాను తీసుకుంటే అతడికి ఆసియా కప్ లో విశ్రాంతి లభించింది. రెండు మ్యాచ్ లకు అతడిని మేనేజ్మెంట్ దూరం పెట్టింది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు అతడికి అవకాశం లభించలేదు. మహమ్మద్ సిరాజ్ కు ఆసియా కప్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు ఎంపికైన సూర్యకుమార్, శివం దూబే, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తికి దాదాపు నెల రోజులపాటు రెస్టు లభించింది. అయితే మూడు ఫార్మాట్లలో పూర్తిస్థాయిలో ఆడుతున్న ప్లేయర్లలో కొంతమందికి మేనేజ్మెంట్ ఏమాత్రం రెస్ట్ ఇవ్వడం లేదు. పైగా వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వర్క్ లోడ్ పెంచుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్లేయర్లకు బదులుగా ప్రత్యామ్నాయం పై మేనేజ్మెంట్ దృష్టి సారించాలని మాజీ ప్లేయర్లు సూచిస్తున్నారు.. ఇక ఇటీవల గిల్ గురించి అజిత్ అగర్కర్ ను విలేకరులు ప్రశ్నించగా.. అతడు యువకుడు.. ఇంకా పాతిక సంవత్సరాలు వయసు మాత్రమే ఉంది.. ఆడితే తప్పేముందని సమాధానం చెప్పడం విశేషం.