India vs Australia: రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 140 పరుగులు చేసి అదరగొట్టాడు. టీమ్ ఇండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఎనిమిది పరుగులకే రోహిత్ (3) రూపంలో వికెట్ కోల్పోయింది. గత కొంతకాలంగా నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న కెప్టెన్ రోహిత్.. ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ దశలో జైస్వాల్, రాహుల్ రెండో వికెట్ కు 43 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి కమిన్స్ మ్యాజిక్ చేసి విడదీశాడు. 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు రాహుల్ కమిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన విరాట్ కోహ్లీ (36), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (82) కుదురుకున్నారు. వీరిద్దరూ ఏకంగా మూడో వికెట్ కు 102 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా బోలాండ్ బౌలింగ్లో అవుట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్ బోలాండ్ బౌలింగ్లో లయన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. దీంతో టీం ఇండియా 164 పరుగులకు ఐదు వికెట్ల కోల్పోయింది.
వారిపైనే ఆశలు
ప్రస్తుతం రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరి పైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. పరిస్థితి చూస్తుంటే మెల్ బోర్న్ మైదానం బ్యాటింగ్ కు సహకరిస్తోంది. బంతి స్వింగ్ అవడం లేదు.. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు బంతిపై గ్రిప్ సాధించి.. బంతులు వేస్తున్నారు. ముఖ్యంగా కమిన్స్, బోలాండ్ పదునైన బంతులు వేస్తున్నారు. ఆస్ట్రేలియా స్కోర్ కు టీమిండియా ఇంకా 310 పరుగుల దూరంలో ఉంది. భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో.. టీమిండియా ఆటగాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేసి.. మూడోరోజు ఆస్ట్రేలియా బౌలర్లపై ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉంది. గత టెస్టులో రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ ఇంతవరకు తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ లెక్కన చూసుకుంటే రిషబ్ పంత్ తన దూకుడు కొనసాగించాల్సి ఉంది. ఇదే సమయంలో క్రీజ్ లో పాతుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే టీమిండియా కు కష్టాలు తప్పవు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. అది జరగాలంటే టీమిండియా ఆటగాళ్లు అద్భుతాన్ని సృష్టించాలి..మెల్ బోర్న్ మైదానంలో మ్యాజిక్ చేయాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. శనివారం మొత్తం టీమిండి ఆటగాళ్లు బ్యాటింగ్ కనుక చేస్తే.. అప్పుడు మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుంది. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆడిన దాని బట్టి టీమిడియాకు అవకాశాలు ఉంటాయని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.