T20 World Cup 2022- Team India: ప్రతీ సంవత్సరం ఎంతో గట్టి టీంను ప్రపంచకప్ కు పంపడం.. మనవాళ్లు కప్ కొట్టకుండానే తిరిగిరావడం కామన్ అయిపోయింది. అప్పుడెప్పుడో ఎంఎస్ ధోని సారథ్యంలో 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం.. ఇక ప్రపంచకప్ టీ20ని ధోని సారథ్యంలోనే 2007లో గెలిచాం. దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా టీమిండియాకు కాలం కలిసిరాలేదు. మన ఆట సాగలేదు. అందుకే ఈ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండు సిరీస్ ల విజయాలతో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో పాల్గొనేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత బృందం గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది. ప్రపంచకప్ టోర్నీకి బయలుదేరే ముందు భారత జట్టు కోచింగ్ సభ్యులు, క్రికెటర్లు, సహాయక సిబ్బంది కలిసి గ్రూప్ ఫొటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులంతా ఆల్ ది బెస్ట్ చెబుతూ షేర్లు చేస్తున్నారు.
టీమిండియా గెలవాలని ఆశిస్తున్నా అదంతా ఈజీ కాదన్నది కాదనలేని సత్యం. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. డెత్ ఓవర్లలో.. అదీ టీ20 లాంటి ధనాధన్ గేమ్ లో భారత్ ను గెలిపించాలంటే బౌలింగ్ అత్యంత కీలకం. అదే బలహీనంగా ఉంది. ఆసియా కప్ లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే.
Also Read: KCR BRS – Harish Rao: కేసీఆర్ బీఆర్ఎస్.. ఫ్లెక్సీల్లో ఎక్కడా కనపడని హరీష్ రావు ఫొటో?
ఇక జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో బలోపేతం అయ్యిందని అందరూ అనుకున్నారు. కానీ బుమ్రా వెన్నునొప్పితో వైదొలగడంతో కథ మొదటికి వచ్చింది. ఇప్పటికే రవీంద్ర జడేజాలాంటి నిక్సారైన ఆల్ రౌండర్ లేని లోటు టీమిండియాను వెంటాడుతోంది. ఇప్పుడు భారత బౌలింగ్ లో ప్రధాన యార్కర్ కింగ్ బౌలర్ అయిన బుమ్రా వైదొలగడంతో మరింతగా కృంగదీసినట్టైంది.
ఇక బుమ్రా స్థానంలో టీమిండియా ఎవరినీ ఎంచుకోలేదు. ప్రస్తుతానికి 14 మందితోనే బయలుదేరింది. స్టాండ్ బైగా ఎంచుకున్న షమీ లేదా దీపక్ చాహర్ లలో ఒకరిని బుమ్రా స్థానంలో తీసుకునే అవకాశాలున్నాయి. అక్టోబర్ 15వరకూ మార్చుకునే ఛాన్స్ ఉండడంతో ఆస్ట్రేలియా వెళ్లాక వారి బలాబలాలను బట్టి టీమిండియాలోకి బుమ్రా స్థానంలో ఒకరిని ఎంచుకోవచ్చు.
అక్టోబర్ 23న భారత్ తన తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఎదుర్కోనుంది. ఇప్పటికే ఆసియా కప్ లో ఒకసారి పాకిస్తాన్ ఓడించి మరో మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. గత రెండు మ్యాచుల్లోనూ పాక్ చేతిలో టీమిండియా ఓడింది. ఈసారి ప్రపంచకప్ లో గెలవకపోతే పరువుపోయే అవకాశం ఉంది. అందుకే పాక్ తో మ్యాచ్ కు ముందు వీటన్నింటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన టీమిండియా ఏమేరకు సర్దుకుటుంది? ఎలా గెలుస్తుంది? కప్ కొడుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.