India vs Pakistan boycott: ఒకప్పుడు పాకిస్తాన్ బీభత్సంగా ఆడేది. టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేది. కొన్ని సందర్భాలలో విజయం కూడా సాధించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గెలుపు మాట పక్కన పెడితే కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఏదో సో సో ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఆడుతోంది. బౌలింగ్లో దమ్ము లేదు. బ్యాటింగ్లో సత్తా లేదు. ఫీల్డింగ్ లో సామర్థ్యం లేదు. అసలు జట్టులోనే విషయం లేదు.
ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు ఆడటం వల్లే పాకిస్తాన్ ఆమాత్రమైనా స్కోర్ చేయగలుగుతోంది. లేకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేదే. ఆదివారం జరిగిన మ్యాచ్లో కూడా అదే పరిస్థితి. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే టీమిండియా బౌలర్లను కాస్తలో కాస్త ప్రతిఘటించారు. వారు కూడా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కనీసం 100 పరుగులు కూడా చేసే సన్నివేశం పాకిస్తాన్ జట్టుకు ఉండేది కాదు. పరుగులు చేయలేకపోవడం.. బౌలింగ్లో వికెట్లు తీయలేకపోవడం.. ఇలా అనేక సమస్యలతో పాకిస్తాన్ జట్టు ఆదివారం నాటి మ్యాచ్లో ఓటమిపాలైంది..
పాకిస్తాన్ గ్రూప్ దశలో ఏకంగా టీమిండియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు దారుణంగా ఉన్నారని… టీమిండియా కు పోటీగా ఏమాత్రం గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయారని.. ఇటువంటి ఆటగాళ్లతో అంచనాలు పెంచుకోవడం సరికాదని అభిమానులు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులైతే ఒక అడుగు ముందుకు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ 4 దశలో టీమిండియా పాకిస్తాన్ జట్టుతో ఆడకూడదని.. ఆ మ్యాచ్ మొత్తాన్ని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే పాకిస్తాన్ జట్టుకు రెండు పాయింట్లు వస్తాయని.. అప్పుడు ఫైనల్ వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అభిమానులు వివరిస్తున్నారు. ఇలా ఓ అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అతడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది.