India Vs Oman Asia Cup 2025: ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు సూపర్ 4 దశకు వెళ్లినప్పటికీ.. ఆ జట్టు ఆట తీరు పట్ల పాకిస్తాన్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి భారత చేతిలో దారుణంగా ఓడిపోయింది భారత్. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పైగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ముందు ఉంచింది. భయంకరమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న భారత్ ఆ లక్ష్యాన్ని అత్యంత సులువుగా ఫినిష్ చేసింది. వాస్తవానికి టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ కెప్టెన్ అత్యుత్సాహం పాకిస్తాన్ జట్టు కొంపముంచింది. గెలిచిన తర్వాత భారత సారథి పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఒక రకంగా వివాదం అయింది. ఈ వివాదం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఆసియా కప్ లీగ్ దశలో చివరి మ్యాచ్లో భారత్ ఒమన్ జట్టుపై 21 పరుగుల తేడాతో గెలిచింది. వాస్తవానికి ఏకపక్షంగా సాగాల్సిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఈ మ్యాచ్లో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు 56 పరుగులతో టాప్ స్కోర ర్ గా నిలిచాడు. గిల్ 5 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా ఒక పరుగు చేసి రన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాట్ పట్టలేదు.. ఒమన్ జట్టు బౌలర్లలో అమీర్, జితేన్, ఫాజిల్ తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఒమన్ జట్టు నాలుగు వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది. విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలైంది. ఓడిపోయినప్పటికీ ఒమన్ జట్టు అద్భుతమైన ప్రతిభ చూపింది. ఓపెనర్లు జాతిందర్ సింగ్ 32, అమీర్ ఖలీమ్ 64, హమ్మద్ మీర్జా 51 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. భారత్ లాంటి బలమైన జట్టుకు తిరుగులేని పోటీ ఇచ్చిన ఒమన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టు కూడా తిట్లను భరిస్తోంది. ఎందుకంటే భారత్ చేతిలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. పోటీ కాదు కదా కనీసం మైదానంలో పరుగులు చేయడానికి కూడా కష్టపడింది. కానీ ఒమన్ భారత జట్టు బౌలర్లను ప్రతిఘటించింది. ముఖ్యంగా టాప్ త్రీ బాటర్లు తిరుగులేని ఇన్నింగ్స్ ఆడారు. ఒకానొక దశలో ఫలితం అంచనాలకు మించి వస్తుందా అనే పరిస్థితి కూడా కనిపించింది. చివరికి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో విజయం సాధ్యమైంది. వాస్తవానికి ఈ స్థాయిలో పోరాటాన్ని పాకిస్తాన్ మొన్న జరిగిన మ్యాచ్లో చూపించి ఉంటే బాగుండేదని.. ఒమన్ ప్లేయర్లను చూసి పాకిస్తాన్ ఆటగాళ్లు నేర్చుకోవాలని విమర్శకులు చురకలు అంటిస్తున్నారు.