India Cricket Team: ఒక్క ఓటమి అంటే సర్దుకుంటాం.. కానీ ఇన్ని పరాభవాలా?

ఇక 2019లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. ఏకంగా సెమి ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ జట్టుతో తలపడిన ఆ మ్యాచ్లో ఓడిపోయింది.

Written By: Neelambaram, Updated On : November 20, 2023 12:36 pm
Follow us on

India Cricket Team: ఓటమే గెలుపుకు నాంది అంటారు. ఆ ఓటమి ద్వారా నేర్చుకున్న గుణపాఠాన్ని అమలులో పెట్టి విజయం సాధించాలంటారు. కానీ ఆ ఓటముల ద్వారా భారత క్రికెట్ జట్టు పెద్దగా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. వరుసగా పది విజయాలు సాధించిన జట్టు మీద ఇలాంటి విమర్శలు ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పనమవచ్చు . కానీ లీగ్ మ్యాచ్లలో చూపించిన ఉత్సాహం ఫైనల్ కి వచ్చేసరికి నీరుగారిపోవడం వంటి పరిణామం 140 కోట్ల అభిమానుల గుండెలను బద్దలు చేసేదే. 2003లో జరిగిన పరాభవం తాలూకు చేదుగాయాన్ని ఈ 2023లో మాన్పుతారు అనుకుంటే.. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావడం పట్ల సగటు అభిమాని ఆవేదన చెందుతున్నాడు.. కేవలం ఈ రెండు ఓటములు మాత్రమే కాదు చివరి అంచె దాకా వచ్చి మ్యాచ్లను కోల్పోయిన సందర్భాలు కోకోల్లలు.

2014 నుంచి..

టి20 వరల్డ్ కప్ ప్రవేశపెట్టిన సంవత్సరంలో భారత జట్టు విజేతగా నిలిచింది.. ఆ తర్వాత 2014లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. జస్ట్ వెంట్రుకవాసిలో కప్ చేజార్చుకుంది. ఒకవేళ ఈ కప్పు గనుక దక్కి ఉంటే భారత క్రికెట్ చరిత్రలో టి20 సిరీస్ కు సంబంధించి రెండవ వరల్డ్ కప్ మనకు సొంతం అయ్యేది.. ఆ పరాభవం నుంచి తేరుకునేందుకు వచ్చిన మరో అవకాశాన్ని కూడా భారత జట్టు చేజార్చుకుంది.. 2015 క్రికెట్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకున్న భారత జట్టు.. ఆ మ్యాచ్లో ఓడిపోయింది. వాస్తవానికి చాలామంది అభిమానులు భారత జట్టు ఈ మ్యాచ్ గెలిచి మూడోసారి క్రికెట్ వరల్డ్ కప్ దేశానికి తీసుకొస్తుంది అనుకున్నారు. కానీ అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ భారత క్రీడాకారులు నిరాశ జనకమైన ప్రదర్శనతో ఓడిపోయారు. ఇక 2016 టీ20 వరల్డ్ కప్ సెమిస్ లోనూ భారత జట్టు ఇలాంటి ప్రదర్శన కొనసాగించింది. ఆటగాళ్లు దూకుడుగా ఆడక పోవడంతో చివర్లో పరాభవం మొదలైంది.. ఇక 2017 సిటీ కప్ ఫైనల్ లోనూ భారత జట్టు తేలిపోయింది. అప్పటిదాకా ఏకపక్ష విజయాలు సాధించి ఫైనల్ దాకా దూసుకెళ్లిన జట్టు.. చివరి దశలో చేతులెత్తేసింది. ఫలితంగా మనకు కప్పు అందకుండా పోయింది.

నాలుగేళ్ల క్రితం కూడా.

ఇక 2019లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. ఏకంగా సెమి ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ జట్టుతో తలపడిన ఆ మ్యాచ్లో ఓడిపోయింది. భారత జట్టు లీగ్ మ్యాచ్లలో చూపించిన దూకుడు ఆ మ్యాచ్లో కొనసాగించకపోవడంతో కివీస్ జట్టు మనల్ని ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఆ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన చూసిన ఎవరికైనా కప్ గెలుస్తుంది అనే అంచనా ఉండేది. కానీ సెమిస్లో ఓడిపోవడం తో ఇంటిదారి పట్టింది. ఇక 2021లో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ లోనూ భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో కనుక భారత జట్టు గెలిచి ఉంటే టెస్ట్ సీరీస్ గద లభించేది. ఇక 2022లో టి20 వరల్డ్ కప్ సెమిస్ లోనూ భారత జట్టు ఓడిపోయింది. అప్పటిదాకా అన్ని మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేసిన భారత క్రీడాకారులు ఫైనల్ కి వచ్చేసరికి తడపడ్డారు.. ఇక ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత జట్టు ఆస్ట్రేలియా కు దాసోహం అయింది. ఫలితంగా భారత జట్టుకు అందాల్సిన గద ఆస్ట్రేలియా వశమయింది. ఇక ఆదివారం జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. స్వ దేశంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ను ఓడించి కప్ సాధిస్తుంది అనుకుంటే.. ఒత్తిడిలో ప్రత్యర్థికి దాసోహం అయిపోయింది.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను కల్లలు చేసి కన్నీళ్లు మిగిలించింది. చాలామంది భారత జట్టుకు సంఘీభావంగా మాట్లాడవచ్చు గాక.. ఇన్ని ఓటములు కళ్ళ ముందు కనిపిస్తుంటే.. కప్పు అందుకునే దశలో తడబాట్లు కనిపిస్తుంటే ముక్తాయింపు అనేది సరిపోదు. జట్టులో సమూల ప్రక్షాళన జరగాలి. అప్పుడే ఆస్ట్రేలియా మాదిరి విజయాలు మన సొంతమవుతాయి.