IND VS AUS Test Match : టీమిండియా కెప్టెన్, ఏస్ బౌలర్ బుమ్రా రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ క్రీజ్ లో ఉండడానికే తిప్పలు పడ్డారు. అలెక్స్ క్యారీ (19*) చేసిన పరుగులే టాప్ స్కోర్ అంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా ప్రారంభించి నిప్పులు జరిగే విధంగా బంతులు వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఉస్మాన్ ఖవాజా (8), మెక్ స్వీని(10), స్టీవెన్ స్మిత్ (0), పాట్ కమిన్స్(3) వంటి ఆటగాళ్లు బుమ్రా దెబ్బకు పెవిలియన్ చేరుకున్నారు. మరో బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా నిప్పులు చెరిగాడు. లబూసాగ్నే(2), మిచెల్ మార్ష్(6) వంటి ఆటగాళ్లను అవుట్ చేసి.. సత్తా చాటాడు. కొంతకాలంగా సరైన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్న సిరాజ్.. ఈ మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. యువ బౌలర్ హర్షిత్ రాణా తన ఆరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టాడు. ప్రమాదకరమైన ఆటగాడు హెడ్ (11) ను క్లీన్ బౌల్డ్ చేసి సంచలనం సృష్టించాడు. హెడ్ అవుట్ కావడంతో భారత జట్టులో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తొలి రోజు ఆట నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా పై 83 పరుగుల లీడ్ లో ఉంది.
ఆస్ట్రేలియా బౌలర్ల ముందు తలవంచింది..
ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా బౌలర్ల ముందు తలవంచింది. నితీష్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) సత్తా చాటడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యశస్వి జైస్వాల్ (0), విరాట్ కోహ్లీ (5), దేవదత్ పడిక్కల్(0) పూర్తిగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మైదానంపై తేమ ఉండడంతో.. దానిని ఆస్ట్రేలియా బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. అద్భుతమైన బంతులు సంధిస్తూ భారత ఆటగాళ్లను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. ఒకానొక సందర్భంలో భారత్ 100 పరుగులైనా చేయగలుగుతుందా? అనే సందేహం ఉన్న నేపథ్యంలో.. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటాడు. హాఫ్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతడి ఎదురుదాడి వల్లే భారత్ 150 పరుగులైనా చేయగలిగింది. లేకుంటే 100 పరుగుల లోపే కుప్పకూలేది. అతడు ఆడిన ఇన్నింగ్సే భారత జట్టుకు ప్రధాన బలంగా మారింది. లేకపోతే పరిస్థితి మరింత అద్వానంగా ఉండేది. అదే జరిగితే టీమిండియా ఇబ్బంది పడాల్సి ఉండేది.