India vs Pakistan Asia Cup Final 2025: 41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తొలిసారిగా ఫైనల్ వెళ్లాయి. ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ప్లేయర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాచ్ మీద ఉత్కంఠ పెరిగిపోయింది. పెరిగిన ఉత్కంఠకు తగ్గట్టుగానే పాకిస్తాన్ ప్లేయర్లు బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు ఫర్హాన్ 57, జమన్ 46 పరుగులతో కదం తొక్కారు. తొలి వికెట్ కు ఏకంగా 84 పరుగులు జోడించారు. దీంతో వీరిద్దరిని అవుట్ చేయడానికి సూర్య కుమార్ యాదవ్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాల్సి వచ్చింది.
9.4 ఓవర్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఫర్హాన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఇక తర్వాత పాకిస్తాన్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. వచ్చిన ఏ ఆటగాడు కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కులదీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ బ్యాటర్లు ఏ మాత్రం కోలుకోలేకపోయారు. అక్షర్ పటేల్ రెండు, వరుణ్ చక్రవర్తి రెండు, బుమ్రా రెండు వికెట్ల చొప్పున తీయడంతో పాకిస్తాన్ ప్రస్థానం త్వరగానే ముగిసిపోయింది. 146 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
వాస్తవానికి పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన పరిస్థితి చూస్తే 200 వరకు పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఏమాత్రం కోలుకోలేకపోయారు. ఓపెనర్లు మినహా మిగతా వారంతా దారుణంగా తేలిపోయారు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుమీద గెలుస్తాం.. ట్రోఫీ అందుకుంటామని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన పాకిస్తాన్ ప్లేయర్లు.. మైదానంలో మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోయారు. ఓపెనర్లు ఆ మాత్రం ఆట తీరు కొనసాగించారు కాబట్టి పాకిస్తాన్ ఆ స్కోర్ చేయగలిగింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ ఆగా 8 పరుగులు చేసి అవుట్ అవ్వడాన్ని భారత నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భారత్ మీద గెలవాలంటే చేయాల్సింది 8 పరుగులు కాదని.. ఈ విషయం పాకిస్తాన్ కెప్టెన్ గుర్తుపెట్టుకోవాలని.. టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.