OG Universe : చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ కి రీసెంట్ గా విడుదలైన ఓజీ(They Call Him OG) చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు. మొదటి రోజు మొదటి ఆట చూసిన ప్రేక్షకుల్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఇంటర్వెల్ సన్నివేశానికి హిట్ కొట్టేసాం అంటూ పెద్ద ఎత్తున అరిచి సంబరాలు చేసుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 166 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా దాటే పరిస్థితి రావడం నిజంగా అభిమానులకు పండుగ లాంటిదే. అయితే ఓజీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?, ఈ ఓజీ రోజులు మళ్లీ తిరిగి వస్తాయా?, ఇలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఎప్పుడు చూస్తామో అనే బాధ కూడా అభిమానుల్లో ఉంది. ఎందుకంటే ఈ చిత్రం తర్వాత అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే భయం వారిలో ఉంది.
ఈ చిత్రం తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉన్నప్పటికీ, అది నేటి తరం యూత్ ఆడియన్స్ కి తగ్గ సినిమా కాకపోవడం, కమర్షియల్ సినిమా అవ్వడం తో, ఓజీ కి ఏర్పడిన మేనియా దీనికి ఏర్పడుతుందా అనే అనుమానాలు అభిమానుల్లో విశ్లేషకుల్లో ఉన్నాయి. అలా బాధపడుతున్న అభిమానులకు ఇప్పుడు ఒక శుభ వార్త. ఓజీ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, యూనివర్స్ అని ఆ చిత్ర దర్శకుడు సుజీత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటుందని,మొత్తం ఈ ఫ్రాంచైజ్ నుండి మరో రెండు సినిమాలు వస్తాయని, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు అంటూ సుజిత్ చెప్పుకొచ్చాడు. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టి, డిసెంబర్ నుండి పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను తెరకెక్కించడం మొదలు పెడతారట. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజ్ లో ప్రీక్వెల్ మొత్తం జపాన్ ని బేస్ చేసుకొని తెరకెక్కిస్తారట, సీక్వెల్ మాత్రం ప్రస్తుత కాలానికి సంబంధించినదిగా ఉంటుందట. ఈ రెండు చిత్రాలను ఏకకాలం లో తెరకెక్కిస్తామని, ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుజిత్. ఆయన చెప్పినట్టు గా ప్లానింగ్ ప్రకారం వెళ్తే కచ్చితంగా ఈ ఫ్రాంచైజ్ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ ఫ్రాంచైజ్ గా పేరు తెచ్చుకుంటుంది. చూడాలి మరి సుజిత్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు అనేది.