IND Vs AUS: బి కే టి సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ల సీరీస్ ఆడుతున్నాయి. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. మూడో మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ఇక నాలుగో మ్యాచ్ గురువారం క్వీన్స్ లాండ్ వేదికగా జరిగింది.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
గత రెండు మ్యాచ్లలో టీమిండియా ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు. అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా.. గిల్ మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికీ గిల్ కు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్లో గిల్ తీవ్రమైన ఒత్తిడి మధ్య మైదానంలో అడుగు పెట్టాడు. గత రెండు మ్యాచ్లలో విఫలమైన అతడు.. నాలుగో మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు.. ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.. గిల్(46), అభిషేక్ శర్మ (28) తొలి వికెట్ కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత.. గిల్ కాస్త మెరుగ్గా ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ (20), శివం దూబే(22) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా టీమ్ ఇండియా 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో ఎల్లిస్ , జంపా చెరి 3 వికెట్లు పడగొట్టారు.
168 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకు కుప్పకూలింది. టీమ్ ఇండియాలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు సాధించాడు.. అక్షర్, శివం దూబే చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించారు. ఓపెనర్లు మార్ష్(30), షార్ట్(25) అదరగొట్టినప్పటికీ.. మిగతా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. యాషెస్ సిరీస్ దృష్టిలో పెట్టుకొని హెడ్, హేజిల్ వుడ్ కు ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరూ లేని లోటు ఆస్ట్రేలియా జట్టులో స్పష్టంగా కనిపించింది. హెడ్ స్థానంలో షార్ట్ వచ్చాడు. హెడ్ మాదిరిగానే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కానీ మిగతా ప్లేయర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. టీమిండియా బౌలర్ల ముందు చేతులెత్తేశారు. జోస్ ఇంగ్లిస్(12), టిమ్ డేవిడ్ (14), స్టోయినీస్(17) విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 48 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.. ఈ గెలుపు ద్వారా టీమిండియా 5 t20 మ్యాచ్ల సిరీస్లో 2-1 తేడాతో ముందంజ వేసింది.
పిచ్ అటు బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా సహకారం అందిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ విషయంలో జాగ్రత్తపడ్డాడు. పదేపదే బౌలర్లను మార్చి మార్చి ఆస్ట్రేలియా బ్యాటర్ల మీదకి ప్రయోగించాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒత్తిడికి గురై ఔట్ అయ్యారు. టీమిండియా కెప్టెన్ అద్భుతమైన వ్యూహ చతురత ప్రదర్శించడంతో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది.