India Asia Cup 2025 Squad: “శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును తుది పోటీ వరకు తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్ గడ్డమీద అప్పుడెప్పుడో సిరీస్ గెలిచారు. కొంతకాలంగా టీమ్ ఇండియా టెస్టులలో అంతగా ఆకట్టుకోలేకపోతోంది. అలాంటప్పుడు అయ్యర్ లాంటి అనుభవం ఉన్న ఆటగాడికి చోటు కల్పించవచ్చు కదా.. అతడిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు” ఆంగ్ల జట్టుతో టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన తర్వాత టీమిండియా శిక్షకుడు గౌతమ్ గంభీర్ కు మీడియా నుంచి ఎదురైన ప్రశ్న అది. ” జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. అన్ని స్థానాలకు ఆటగాళ్లు ఉన్నారు. అందువల్లే అయ్యర్ ను ఎంపిక చేయలేదు. అతడి సేవలను మిగతా ఫార్మాట్లలో ఉపయోగించుకుంటాం” ఇదీ గౌతమ్ గంభీర్ చెప్పిన సమాధానం.
గౌతమ్ గంభీర్ ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆసియా కప్ కు అయ్యర్ కు చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. ఒకానొక సందర్భంలో అతడికి ఉపసారథి బాధ్యతలు అప్పగిస్తారని కూడా అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను మేనేజ్మెంట్ తలకిందులు చేసింది. అంతేకాదు అయ్యర్ కు చోటు కల్పించకుండా.. కొంతకాలంగా ఫామ్ లో లేకుండా ఇబ్బంది పడుతున్న శివం దుబే, జితేష్, చక్రవర్తి వంటి ప్లేయర్లకు అవకాశం కల్పించింది. వాస్తవానికి వీరితో పోల్చి చూస్తే అయ్యర్ ఎంతో అత్యుత్తమం. పైగా ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో అతడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అత్యంత వైవిధ్యమైన దుబాయ్ మైదానాలపై అదరగొట్టాడు. అయితే అటువంటి ఆటగాడిని ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్, ఇప్పుడు ఆసియా కప్ కు దూరం పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: గిల్ కు ప్రమోషన్, అతడికి షాక్.. ఆసియా కప్ కు టీమిండియా ఇదే!
వాస్తవానికి గౌతమ్ గంభీర్ జట్టుకు శిక్షకుడిగా ఉన్నంతవరకు అయ్యర్ కు చోటు లభించదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు మెంటర్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలోనే కోల్ కతా ఐపీఎల్ విజేతగా నిలిచింది. నాడు ఆ జట్టుకు సారధిగా అయ్యర్ ఉన్నాడు. అప్పట్లో అయ్యర్, గంభీర్ మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ ఎప్పుడైతే ట్రోఫీ సాధించిన క్రెడిట్ మొత్తం గంభీర్ ఖాతాలోకి వెళ్లిందో.. అప్పటినుంచి అయ్యర్ ఒకరకంగా ముభావంగా ఉన్నాడు. ఆ తర్వాత తనకు ఫీజు పెంచే విషయంలో మేనేజ్మెంట్ సుముఖంగా లేకపోవడం.. గౌతమ్ గంభీర్ కూడా సహకరించకపోవడంతో అయ్యర్ కు కోపం వచ్చింది. అప్పట్లోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత షారుక్ ఖాన్ జట్టు నుంచి అయ్యర్ బయటికి వచ్చాడు. టీమిండియా కు శిక్షకుడిగా గంభీర్ నియమితుడయ్యాడు. ఇద్దరు వేరువేరు దారుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ.. తమ కోపాన్ని మాత్రం మర్చిపోలేక పోయారు. దీంతో గంభీర్ అయ్యర్ కు జట్టులో చోటు దక్కకుండా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగానే గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ అయ్యర్ కు గంభీర్ అవకాశం ఇవ్వడం లేదు. నాడు జట్టులో స్థానాలు అన్ని ఫిల్ అయిపోయాయని చెప్పిన గంభీర్.. ఇప్పుడు ఆసియా కప్ విషయంలో ఏం చెప్తాడో చూడాల్సి ఉంది.