India Vs West Indies 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. అన్ని వైపుల నుంచి ఆటగాళ్లు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయ లేకపోతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ కూడా తగిన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భారత ఆటగాళ్లకు సుమారు నెలరోజుల పాటు విశ్రాంతినిచ్చే విధంగా షెడ్యూల్ మార్పు చేసింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్న భారత జట్టుకు ఆ జట్టులోని ఒక యంగ్ ప్లేయర్ నుంచి తీవ్రమైన ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత జట్టు జూలై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలతోపాటు ఐదు టి20 మ్యాచ్ లు కూడా ఆడనుంది. అందుకు అనుగుణంగా ఇద్దరు కెప్టెన్లతో కూడిన రెండు విభిన్నమైన టీములను బీసీసీఐ వెస్టిండీస్ పర్యటనకు పంపిస్తోంది. వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శిష్యుడుగా పేరుగాంచిన ఒక క్రికెటర్ నుంచి తీవ్రమైన ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ ఆటగాడే వెస్టిండీస్ జట్టు టెస్ట్ కెప్టెన్ జర్మైనే బ్లాక్ వుడ్. ఈ సిరీస్ లో ఇండియా జట్టుకు కొరకరాని కొయ్యగా ఈ ఆటగాడు మారే అవకాశం కనిపిస్తోంది.
భీకరమైన ఫామ్ లో బ్లాక్ వుడ్..
వెస్టిండీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బ్లాక్ వుడ్ గత కొన్నాళ్ల నుంచి అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన టెస్ట్ మ్యాచ్ ల్లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్నాడు ఈ యంగ్ క్రికెటర్. ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడిన బ్లాక్ వుడ్.. 30.52 సగటుతో 2839 పరుగులు చేసి తన సత్తాను చాటాడు. ఇందులో మూడు సెంచరీలు, 18 అర్థ సెంచరీలు ఉండడం గమనార్హం. బ్లాక్ వుడ్ తన చివరి టెస్ట్ సెంచరీని 2022 మార్చిలో ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి చేశాడు.
కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ జట్టు కూడా బ్లాక్ వుడ్ పై గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకుంటాడన్న నమ్మకాన్ని తనపై ఏర్పాటు చేసుకున్నాడు. క్రీజులో కుదురుకుంటే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.
కోహ్లీ నుంచి మెలకువలు నేర్చుకున్నట్లు చెప్పిన బ్లాక్ వుడ్..
2019లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళినప్పుడు.. తొలిసారి టెస్ట్ క్రికెట్ భారత్ పై ఆడాడు బ్లాక్ వుడ్. ఆ సమయంలో విరాట్ కోహ్లీతో ఎక్కువ సమయాన్ని వెచ్చించి పలు కీలక విషయాలపై అవగాహన తెచ్చుకున్నాడు వుడ్. విరాట్ కోహ్లీ తో మాట్లాడినప్పుడు అనేక మెలకువలు నేర్చుకున్నట్లు బ్లాక్ వుడ్ స్వయంగా గతంలో చెప్పాడు. ఆ మెలకువలను భారత్ పై కూడా అన్వయించుకోవాలని, క్రీజులో నిలబడి గరిష్టంగా పరుగులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వుడ్ వెల్లడించాడు. భారత లాంటి పటిష్టమైన జట్టుపై రాణిస్తే తనకు మరింత పేరు వస్తుందని, అదే సమయంలో తన సత్తాను బయట ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా వుడ్ వెల్లడించాడు. చూడాలి వెస్టిండీస్ పర్యటనకు వస్తున్న భారత జట్టుపై ఈ యంగ్ లెజెండ్ ఏ స్థాయిలో ప్రదర్శన చేయనున్నాడో.