YS Jagan – BJP : తనకు బీజేపీ సపోర్టు లేదని జగన్ చెబుతున్నారు. తాను ఏకాకినని ప్రజల ముందు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కానీ నాలుగేళ్లుగా బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర సహకారం జగమెరిగిన సత్యం. అవసరం అనుకున్న సందర్భాల్లో వైరి పక్షాలు సహకరించుకుంటూ వచ్చాయి. జగన్ ఢిల్లీ వెళితే అగ్రతాంబూలం. అడిగిన వెంటనే మోదీ, షాల అపాయింట్ మెంట్. రాష్ట్ర ప్రయోజనల కోసమే తాను కలుస్తున్నట్టు జగన్ స్టేట్ మెంట్. గో హెడ్ అంటూ అగ్రనేతల అభయహస్తం. నాలుగేళ్లుగా ఈ చిత్ర విచిత్రాలన్నీ చూసిన తరువాత ఆ రెండు పార్టీల మధ్య స్నేహం లేదంటే ఎలా నమ్మాలి? ఏపీ ప్రజలు అమాయకులు అనుకుంటే ఏమనుకోవాలి.
జగన్ సర్కారుకు లెక్కకు మించి కేంద్రం ఆర్థిక ప్రయోజనాలను కల్పించింది. అవి శాశ్వత ప్రాజెక్టుల కోసమా అని ఆరాతీసిన సందర్భాలు లేవు. ఇంత ప్రయోజనం కల్పిస్తున్నా ఆ నిధులన్నీ ఏమవుతున్నాయని ప్రశ్నించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి వచ్చి జగన్ సర్కారు అవినీతిది అంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ జగన్ సర్కారును మోదీ పుత్రవాత్సల్యంతో సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కుమారుడు అప్పులతో ఇళ్లు గుల్ల చేస్తుంటే తల్లిదండ్రులు సరిచేస్తారు. కానీ ఇక్కడ దత్తతగా ఉన్న జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్న మోదీ సరిదిద్దే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు.
ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం ఇటీవల రూ.28 వేల కోట్ల సాయం చేసినట్టు ప్రకటించింది. అయితే ఇందులో ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించారా? ఉద్యోగ, ఉపాధిని మెరుగుపరిచే పథకాలకు ఊతమిచ్చారా? అంటే అదీ లేదు. అది కేవలం ఆర్భాటపు పథకాలకు చేసిన అప్పులకు ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలో ఉన్న రెవెన్యూలోటు రూ.10 వేల కోట్లను జమ చేసింది. పోలవరానికి రూ.13 వేలు కోట్లు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రుణ పరిమితిలో విధించే కోతలో సైతం వెసులబాటు కల్పించింది. ఏకంగా రూ.5 వేల కోట్లు సేకరించేందుకు అనుమతిచ్చింది. ఇవన్నీ కేంద్రానికి తెలియకుండా జరుగుతున్నాయా? అంటే అది ఊహించుకోలేని ప్రశ్న.
2014 రాష్ట్ర విభజన జరిగిన తరువాత.. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్ర రెవెన్యూ లోట రూ.16,078 కోట్లు. స్వయంగా కాగ్ నాడు నిర్ధారించింది. అయినా నాడు కేంద్రం విడుదల చేసింది ఎంతో తెలుసా.. అక్షరాల 5,600 కోట్లు మాత్రమే. అంతకు మించి దమ్మిడిని విడుదల చేసేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. 2023, 24 ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్ల రుణ పరిమితిలో కోత విధించాల్సి ఉండగా.. దానిని కూడా వెసులబాటు కల్పించింది. వాయిదా పద్ధతిలో మాత్రమే కోత విధించడానికి డిసైడయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పెద్దలు జగన్ ను దత్తపుత్రుడుగా చూసుకున్నారు. కానీ జగన్ తాను ఒంటరినయ్యానంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.