IND vs WI : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా టి20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో నిరాశపరిచింది. మూడో టి20 నుంచి ఫామ్ లోకి వచ్చిన భారత జట్టు అదరగొడుతోంది. కీలకమైన నాలుగో టీ20లో కుర్రాళ్ళు కుమ్మేశారు.. దీంతో విండీస్‌పై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
టార్గెట్ 179..
కరీబియన్ జట్టు నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. తొలి మూడు టీ20ల్లో నిరాశపర్చిన శుభ్‌మన్ గిల్ 47 బంతుల్లో 77 పరుగులు (3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ సారి తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే పరుగు చేసి వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ నాలుగో టి 20 లో చెలరేగాడు 51 బంతుల్లో 84 నాట్ అవుట్ గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. రెండో మ్యాచ్‌లో దంచికొట్టి టీ20ల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మయర్ 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. షై హోప్ 29 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఓపెనర్ల దూకుడు..
లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. మెకాయ్ వేసిన తొలి ఓవర్‌లో బంతిని రెండు సార్లు బౌండరీకి పంపించిన యశస్వి.. హోల్డర్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. తర్వాత గిల్ జోరందుకున్నాడు. మెకాయ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ సిక్సర్ బాదిన అతడు.. ఒడియన్ స్మిత్ బౌలింగ్‌లో 6,4 దంచేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 66 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లిద్దరూ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లకు స్కోరు 100కు చేరింది. రోవ్‌మన్ పావెల్ తర్వాతి ఓవర్‌లోనే ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. గిల్ 30 బంతుల్లో, యశస్వి 33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.
కొనసాగిన జోరు .
అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా వీరి జోరు కొనసాగింది. అకీల్ హోసీన్ బౌలింగ్‌లో యశస్వి సిక్స్ బాదగా.. స్మిత్ వేసిన 13 ఓవర్లో చెరో సిక్స్ రాబట్టారు. మెకాయ్ వేసిన 14 ఓవర్‌లో చివరి రెండు బంతులకు యశస్వి వరుసగా 4,6 బాదాడు. షెఫర్డ్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన గిల్.. అదే ఓవర్‌లో షై హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే భారత్ విజయానికి చేరువైంది. తిలక్ తో కలిసి యశస్వి జైస్వాల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సిరీస్ నిర్ణయక ఐదో టి20 ఆదివారం జరగనుంది.