IND vs SA: త్వరలోనే టీంఇండియా దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది. టెస్ట్ సీరిస్ కు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా .. వన్డే సిరీసుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ ప్రకటించింది. అయితే వన్డే కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీని బీసీసీఐ తప్పించడంపై వివాదం నెలకొంది. ఈనేపథ్యంలో కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు తాజాగా విన్పిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీంఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీని కెప్టెన్ గా తప్పించాలనే డిమాండ్ కొంతకాలంగా విన్పిస్తోంది. ఇదే సమయంలో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీలను పలుసార్లు గెలుచుకుంది. దీంతో కోహ్లీని కెప్టెన్సీగా తప్పించి రోహిత్ కు జట్టు పగ్గాలివ్వాలనే డిమాండ్స్ తెరపైకి వచ్చాయి.
ఈ విషయంపై బీసీసీఐ సుదీర్ఘంగా చర్చించింది. ఇటీవల న్యూజిల్యాండ్ తో భారత్ టెస్టు సిరీసును గెలిచాక బీసీసీఐ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును ఖరారు చేసింది. టెస్టు జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనుండగా వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే వన్డే కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ కు కోహ్లీ తన సోషల్ మీడియాలో కనీసం విషెస్ కూడా చెప్పలేదు.
దీంతో టీంఇండియాలో విబేధాలు నెలకొన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ఈక్రమంలోనే నేడు ముంబైలో దక్షిణాఫ్రికాతో 3టెస్టుల సిరీస్‌కు ఎంపికైన టీమిండియా సమావేశం కానుంది. కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే వేదికపైకి రానుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. టెస్టు జట్టు దక్షిణాఫ్రికా వెళ్లడానికి ముందు ముంబైలో 3రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
ఈమేరకు టెస్టు జట్టు మొత్తం ఆదివారం ముంబై చేరుకోనున్నది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఆటగాళ్లంతా ముంబై హోటల్లోనే బస చేయనున్నారు. రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్, టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా అయ్యాక తొలిసారిగా నేడు విరాట్ కోహ్లీని కలవబోతున్నాడు. దీంతో నేటికి కెప్టెన్సీ వివాదానికి తెరపడే అవకాశం కన్పిస్తుంది.
ఇక ఈ టెస్టు సిరీసులోనే విరాట్ కోహ్లీ 100టెస్టులు ఆడిన ఆటగాడిగా మరో రికార్డుకు చేరుకోబోతున్నాడు. ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే కెప్టెన్సీ వివాదానికి చెక్ పడటనుంటంతో ప్లేయర్స్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్ ఒక్క టెస్టు సిరీసు కూడా గెలుచుకోలేదు. దీంతో ఈ సిరీస్ టీంఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కు సైతం కీలకంగా మారనుంది.
దక్షిణాఫ్రికాకు వెళ్లే భారత టెస్టు జట్టు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్. రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్. స్టాండ్ బాయ్ ప్లేయర్లుగా నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగాస్వాలాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.