IND Vs SA: రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా, దక్షిణాఫ్రికా శనివారం గుహవాటి వేదికగా తలపడుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిపోయిన భారత్.. రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. తొలి టెస్ట్ గెలిచిన దక్షిణాఫ్రికా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ క్రమంలో గుహవాటి లో గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
కోల్ కతా నేర్పిన అనుభవం నేపథ్యంలో గుహవాటి పిచ్ ను పూర్తిగా ఎర్రమట్టితో రూపొందించారు. పెరిగిన గడ్డిని కత్తిరించారు. దీంతో ప్రారంభంలో పేస్ బౌలర్లు అదరగొట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు పిచ్ తేమ కోల్పోతుంది కాబట్టి అదరగొట్టే అవకాశం ఉంది. గుహవాటి ఈశాన్య భారతదేశంలో ఉంటుంది కాబట్టి.. ఇక్కడ విపరీతంగా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకే మ్యాచ్ మొదలుపెట్టారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్ కతా లో కూడా దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది.
గుహవాటి వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి లంచ్ కంటే ముందు ఇక్కడ టీ బ్రేక్ ఇస్తున్నారు. అంటే ఉదయం 11 గంటల నుంచి 11:20 నిమిషాల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ చలికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా అవుతాయి. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియాలో గిల్ స్థానాన్ని పంత్ తో భర్తీ చేశారు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్ కు అవకాశం ఇచ్చారు. అక్షర్ పటేల్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.
బంతి బౌన్స్ అవుతున్న నేపథ్యంలో సిరాజ్, బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. గడ్డిని కత్తిరించడంతో బంతి మీద కూడా గ్రిప్ ఈజీగా దొరుకుతోంది. కోల్ కతా టెస్టులో కూడా భారత బౌలర్లు ఇదేవిధంగా బౌలింగ్ వేశారు. గుహవాటి టెస్ట్ లో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ చేయాలని భారత బౌలర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పేస్ బౌలర్లు మాత్రమే కాదు, స్పిన్ బౌలర్లు కూడా బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు కోల్ కతా లో కులదీప్, జడేజా ఏ విధంగా ప్రతిభ చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, ఈ మైదానం భారతదేశంలో 30వ టెస్ట్ ఘనత సృష్టించింది.