IND Vs PAK Highlights: అంచనాలు పెరిగిపోతాయి. ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. బీభత్సంగా పరుగులు తీస్తుంటారు. వేగంగా వికెట్లు పడగొడుతుంటారు. చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంటారు. చివరి వరకు విజయం దోబూచులాడుతుంది. అందువల్లే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే.. రెండు దేశాల అభిమానులకు మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచానికి ఒక రకమైన ఉత్కంఠ.
గతంలో జరిగిన మ్యాచులు అద్భుతంగా సాగేవి కాబట్టి ఐసీసీ కూడా ఖచ్చితంగా భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ పెట్టేది. దీనివల్ల ఐసీసీకి దండిగా ఆదాయం వచ్చేది. స్టేడియంలో సీట్లు మొత్తం నిండిపోయేవి. ఇక టీవీ చానల్స్ లో ప్రకటనల ఆదాయం అంతకంతకు పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ఉద్వేగం లేదు. ఉత్సాహం కనిపించడం లేదు. ఏదో సో సో గా సాగుతోంది వ్యవహారం. తాజాగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్ నే చూసుకుంటే.. మొదట్లో ఈ మ్యాచ్ నిర్వహించకూడదని అభిమానులు డిమాండ్ చేశారు. మ్యాచ్ బై కాట్ చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఉద్యమాలు నిర్వహించారు. అసలు మైదానాలకు వెళ్లకుండా ఉండాలని తీర్మానించుకున్నారు. టీవీలలో కూడా మ్యాచ్ చూడొద్దని భావించారు. వాస్తవానికి ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు మైదానంలో పాకిస్తాన్ భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. జరగడానికి ఆస్కారం ఏర్పడలేదు. దీంతో మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. తద్వారా చూస్తున్న అభిమానులకు ఎటువంటి మజా రాలేదు.
వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. ఉత్కంఠ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక మిగతా వ్యవహారాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో జరిగే ఉద్యమాలు ఒక రేంజ్ లో ఉంటాయి. కామెంట్లు హద్దులు దాటిపోతుంటాయి. మాటలు పరిధిలు మించిపోతుంటాయి. అయితే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మీద స్పష్టమైన లీడ్ కొనసాగిస్తోంది. ఫార్మాట్ ఎలాంటిదైనా సరే దుమ్ము రేపుతోంది. ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో కూడా గత పరిణామమే చోటుచేసుకుంది. పాకిస్తాన్ జట్టు కు మరోసారి పరాభవం తప్పలేదు. అన్నిటికి మించి ఈ మ్యాచ్ సగటు అభిమానికి ఎటువంటి క్రికెట్ ఆనందాన్ని అందించలేదు.. పహల్గాం దాడి.. ఇతర పరిణామాలు బహుశా ఈ మ్యాచ్ మీద ప్రేక్షకులకు అంతగా ఆసక్తిని కలిగించలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా భారీగా ఆదాయం వస్తుందని సోని సంస్థ అంచనా వేసినప్పటికీ.. అది నెరవేరలేదు .