Jagan vs Sharmila: విజయమ్మ( y s vijayamma ).. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణిగా ఉమ్మడి రాష్ట్రానికి సుపరిచితం. భర్త ఉన్నంతవరకు రాజకీయాల కోసం మాట్లాడలేదు విజయమ్మ. భర్త ఏనాడైతే మరణించారో నాటి నుంచి ఆమె బయటకు వచ్చారు. ముందుగా కుమారుడి కోసం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించారు. తన అభ్యర్థనను తిరస్కరించడంతో వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. చివరకు ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఊరు వాడ ప్రచారం కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తన అన్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయమ్మ. తర్వాత షర్మిలకు అండగా నిలిచారు. అదే షర్మిల ఏపీ రాజకీయాల కు రావడంతో విజయమ్మ ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అయితే ఆ కుటుంబంలో తలెత్తింది రాజకీయ విభేదం కాదు.. వ్యక్తిగత ఆస్తి వివాదాల్లో మాత్రమే వారి మధ్య విభేదాలు రాజకీయ వైరానికి దారితీసాయని తాజా పరిస్థితులు తెలుస్తున్నాయి.
కొనసాగుతున్న కోర్టు వివాదం..
సరస్వతి పవర్ ఇండస్ట్రీకి( Saraswati power industry) సంబంధించిన భూముల విషయంలో కోర్టు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. అయితే తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ మైలేజీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించడం విశేషం. చెల్లెలు షర్మిల తో ఆయనకు రాజకీయ కలహాలను పరిష్కరించుకునేందుకే.. జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సరస్వతీ పవర్ లిమిటెడ్ లో వాటాల బదలాయింపు, రిజిస్టర్ లో వాటాదారుల పేర్లు మార్పుపై ఎన్సీఎల్టీ హైదరాబాదులో ఇదివరకే జగన్ పిటిషన్ దాఖలు చేయడం చేశారు. అయితే తాజాగా విజయమ్మ మాత్రం.. ఆ ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి జగన్ తన రాజకీయ మైలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్ డీడ్ లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందం అని.. చట్ట ప్రకారం దానికి ప్రాధాన్యమవుతుందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని విజయమ్మ పేర్కొన్నారు.
ఆమెది విచిత్ర పరిస్థితి..
ప్రస్తుతం విజయమ్మ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుమార్తెకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తున్నారు. అలాగని కుమారుడు జగన్మోహన్ రెడ్డిని విడిచి పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే ఆమె పరిస్థితిని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చెన్నై కోర్టులో తాజాగా ఆమె చేసిన ఆరోపణలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తప్పు పట్టినట్టు కనిపిస్తున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డితో కుటుంబ వేదికలు పంచుకుంటున్నారు. దగ్గరకు తీసుకుని ఆత్మీయతను పంచుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం షర్మిల తో కలిసి నడుస్తున్నారు. ఆమెకు సింహభాగం ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. పిల్లల మూలంగా విజయమ్మ పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. ఏం చెయ్యాలో పాలు పోలేని స్థితిలో ఉన్నారు.