IND vs PAK : ఆదివారం జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఐదో మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన జట్టు ఎక్కడ తప్పు చేసిందో చెప్పుకొచ్చాడు. పాక్ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణంగా విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ లను పేర్కొన్నాడు. మ్యాచ్‌ను వారిద్దరూ తమకు దక్కకుండా చేశారని ఆరోపించాడు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిజానికి నిన్న జరిగిన స్టేడియం పిచ్ బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదట టాస్ గెలిచిన అవకాశాన్ని పాకిస్తాన్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ తర్వాత మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. “మేము టాస్ గెలిచాం, కానీ టాస్ వల్ల మాకు ప్రయోజనం లభించలేదు. వారి బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు.” అని చెప్పుకొచ్చాడు.
నేను, సౌద్ షకీల్ ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనుకున్నాం. కానీ మా షాట్ ఆఫ్షన్ ఫెయిల్ అయింది. భారత్ ప్లేయర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. అన్ని విభాగాల్లోనూ బాగా రాణించలేకపోయాము. నిజానికి భారత ప్లేయర్ల మీద ఒత్తిడి తీసుకుని రావాలనుకున్నాం. కానీ అలా చేయలేకపోయాము. విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ మ్యాచ్‌ను మాకు కాకుండా దూరం చేశారు. మేము ఇంకా మా ఫీల్డింగును మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మేము చాలా తప్పులు చేసాం” అని రిజ్వాన్ అన్నారు..
టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని ఒప్పుకుంది. పాకిస్తాన్ తొలి ఎదురు దెబ్బ బాబర్ ఆజమ్ రూపంలో తగిలింది. 23 పరుగులు చేసిన తర్వాత అతను హార్దిక్ పాండ్యా చేతిలో అవుట్ అయ్యాడు. దీని తర్వాత ఆరు బాల్స్ కే ఇమామ్ ఉల్ హక్‌ను అక్షర్ పటేల్ రనౌట్ చేశాడు. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ వరకు తీసుకెళ్లగలిగారు. కానీ వారు వేగంగా పరుగులు సాధించడంలో ఫెయిల్ అయ్యారు. అక్షర్ పటేల్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు.. రిజ్వాన్ ను బౌల్డ్ చేశాడు.
పాకిస్తాన్ తరపున సౌద్ షకీల్ అత్యధిక పరుగులు చేశాడు. అతడు ఈ ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేశాడు. అతడిని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. భారత్ తరఫున కుల్ దీప్ యాదవ్ అత్యధిక వికెట్లు(3) పడగొట్టాడు.
పాకిస్తాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించే క్రమంలో భారత్ వేగంగా ఆరంభించింది. రోహిత్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభమన్ గిల్ 46 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 15 పరుగులు చేయడం ద్వారా 14 వేల పరుగులు పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.