IND vs NZ: న్యూజిలాండ్ (IND vs NZ) జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ 300 పరుగులు చేసినప్పటికీ.. భారత్ దుమ్ము రేపే స్థాయిలో బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ కోల్పోయినప్పటికీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ సూపర్ పెర్ఫార్మన్స్ చేయడంతో టీమిండియా విజయం నల్లేరు మీద నడకలాగా సాగింది.
ఇదే జోరులో బుధవారం రాజ్ కోట్ నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే లో భారత్ దూకుడు కొనసాగిస్తుందని అందరు అనుకున్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్ము రేపుతారని అభిమానులు భావించారు. కానీ అభిమానులు ఆశించింది ఒకటైతే.. జరిగింది ఒకటి. ఈ మ్యాచ్లో కెప్టెన్ గిల్ (56) హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. వరుసగా రెండవ హాఫ్ సెంచరీ చేసి తన ఫామ్ నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ఆడాడు. 38 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ కూడా 23 పరుగులు మాత్రమే చేసి క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ కావడంతో టీమ్ ఇండియా ఒక్కసారిగా కష్టాల్లో పడింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. 17 బంతులు ఎదుర్కొన్న అతడు 8 పరుగులు మాత్రమే చేసి.. క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్లో టీమిండియా భారీ స్కోరులు సాధించడానికి ప్రధాన కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో వీరిద్దరూ ఆకట్టుకున్నారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 300 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో విరాట్ కోహ్లీ తన వంతు పాత్ర పోషించాడు. అయితే విరాట్, రోహిత్ ఔట్ కాగానే జట్టులో ఒకసారిగా ఆత్మ న్యూనతా భావం ఆవహిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్ కోట్ వన్డేలో అదే కనిపించింది. మొదట్లో ఓవర్ కు ఆరు పరుగులు చొప్పున రన్ రేట్ కొనసాగించిన టీమిండియా.. రోహిత్, విరాట్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా డిఫెన్స్ లో పడింది. దీంతో టీమిండియా ప్లేయర్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్, విరాట్ కోహ్లీ లేకుండా మ్యాచ్ లు ఆడ లేరా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.